అది మోడీ, సుష్మాల దౌత్యవిజయం కాదా?

March 02, 2019


img

ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనలపై ప్రతిపక్షాలు, మీడియా చాలా విమర్శలు చేస్తుంటాయి. కుళ్ళు జోకులు వేస్తుంటాయి. కానీ ఆయన విదేశీ పర్యటనలలో అగ్రరాజ్యాలతో స్నేహసంబందాలను బలపరుచుకొని భారత్‌కు అనుకూలంగా తిప్పుకోవడం వలన ఆపత్సమయంలో భారత్‌కు అంతర్జాతీయ మద్దతు కూడగట్టగలిగారని తాజా పరిణామాలతో మరోసారి నిరూపితమైంది. 

సౌదీ యువరాజు మొదట పాక్‌ పర్యటనకు వెళ్ళి ‘ఆ దేశం తమకు చాలా ఆప్తమైనదని దానికి అండగా నిలబడతామని చెప్పి వందలకోట్ల విలువగల వ్యాపార ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. పుల్వామా ఉగ్రదాడి తదనంతరం భారత్‌-పాక్‌ మద్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నవేళ సౌదీ యువరాజు ఆవిధంగా పాక్‌కు అనుకూలంగా వ్యవహరించడంతో సహజంగానే భారతీయులు తీవ్ర ఆగ్రహం చెందారు.  

ఆ తరువాత సౌదీ యువరాజు భారత్‌ వచ్చినప్పుడు, ప్రధాని నరేంద్రమోడీ అసలు ఏమీ జరగనట్లుగా ప్రోటో కాల్ మర్యాదలను పక్కన పెట్టి స్వయంగా సౌదీ యువరాజుకు ఎదురేగి ఆలింగనం చేసుకొని సాధారంగా స్వాగతం పలికారు. మోడీ చర్యపై అప్పుడు ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కానీ ఆ చిన్న చర్యతో అంతకు ముందు పాక్‌కు అనుకూలంగా వ్యవహరించిన సౌదీ అరేబియా చేతే పాక్‌ ప్రభుత్వంపై అభినందన్‌ వర్ధమాన్‌ విడుదలకు ఒత్తిడి చేయించగలిగారు. 

అభినందన్‌ వర్ధమాన్‌ పాక్‌ చెరలో బందీగా చిక్కినప్పుడు భారత్ విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ పాకిస్థాన్‌కు వంతపాడుతున్న చైనాకు వెళ్ళి ఆ దేశ విదేశాంగ మంత్రితో ఈ సమస్య తీవ్రతను వివరించడంతో చైనా కూడా పాక్‌కు దూరం జరిగింది. కష్టకాలంలో అండగా నిలబడుతుందనుకొన్న చైనా మౌనం వహించడం, మిత్రదేశమనుకొన్న సౌదీ అరేబియా, అగ్రరాజ్యాల నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో విధిలేని పరిస్థితులలో పాక్‌ ప్రభుత్వం అభినందన్‌ వర్ధమాన్‌ను భారత్‌కు అప్పగించడానికి అంగీకరించింది. 

భారత్‌ యుద్దవిమానాలు పాక్‌ భూభాగంలో ప్రవేశించి దాడులు నిర్వహించి వెనక్కు వెళ్ళిపోయినప్పుడు, పాక్‌ పార్లమెంటులో ‘షేమ్ షేమ్ ఇమ్రాన్ ఖాన్’ అంటూ ఎద్దేవా చేసిన పాక్‌ ప్రతిపక్షాలు, సరిగ్గా రెండు రోజుల తరువాత అదే పార్లమెంటులో అదే ఇమ్రాన్ ఖాన్‌ ‘అభినందన్‌ వర్ధమాన్‌ను భారత్‌కు తిరిగి అప్పగించబోతున్నామని’ ప్రకటించినప్పుడు అవే ప్రతిపక్షాలు బెంచీలు చరిచి హర్షద్వానాలతో ఆమోదం తెలుపడం గమనిస్తే పాక్‌ అంతర్జాతీయంగా ఎంత ఒత్తిడికి గురయిందో అర్ధం చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా ప్రధాని నరేంద్రమోడీ, సుష్మా స్వరాజ్ దౌత్యవిజయమే కదా! 


Related Post