ఇది అసలు..అది పాక్‌ కోసం

March 02, 2019


img

పాక్‌కు బందీగా చిక్కిన భారత్ వింగ్ కమాండర్ అభినందన్‌ వర్ధమాన్‌ నిన్న మధ్యాహ్నం ఒంటిగంటకు భారత్‌కు అప్పగించవలసి ఉండగా రాత్రి 9.30 గంటలకు అప్పగించబడ్డారు. ఆలస్యానికి కారణం ఆయన అప్పగింతకు సంబందించి పేపర్ వర్క్ ఆలస్యం కావడమేనాని అందరూ అనుకొన్నారు. కానీ పాక్‌ అధికారులు కాస్త అతితెలివి ప్రదర్శించి ఆయనను భారత్‌కు అప్పగించే ముందు, ఆయన చేత పాక్‌కు అనుకూలంగా మీడియా స్టేట్మెంట్ ఇప్పించుకొన్నారు. అందుకే అంతా ఆలస్యమైందని ఆయన విడుదల తరువాత తెలిసింది. పాక్‌ చేతిలో బందీగా ఉన్న ఆయన పాక్‌కు అనుకూలంగా కాక పాక్‌ తప్పులను ఎత్తిచూపుతారనుకోలేము. కనుక పాక్‌ అధికారులు తనను చాలా బాగా చూసుకొన్నారని, తన విషయంలో భారత్‌ మీడియా అతిగా వ్యవహరిస్తోందంటూ చెప్పారు. అది పాక్‌ అధికారులు  సూచించినట్లు చెప్పినవని అర్ధమవుతూనే ఉంది. 

రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఆయనకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించినప్పుడు ఆయన పాక్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వివరించారు. తనపై పాక్‌ అధికారులు భౌతికంగా దాడులు చేయలేదు కానీ వారి చెరలో ఉన్న 60 గంటలలో మానసికంగా చాలా వేధించారని అభినందన్‌ వర్ధమాన్‌ చెప్పారు. అయితే భారత్‌ దౌత్యం ఫలించి పాక్‌ చెరలో నుంచి క్షేమంగా బయటపడగలిగారు. ఇది ఆయనకు పునర్జన్మ వంటిదేనని చెప్పవచ్చు.


Related Post