జగన్‌ కోరితే ప్రచారానికి వస్తా: అసదుద్దీన్ ఓవైసీ

March 02, 2019


img

సుమారు 10 ఏళ్ళ క్రితం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పటి నుంచి ఆయన కుమారుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని తపించిపోతున్నారు. ఈ పదేళ్ళలో తండ్రి నీడలో నుంచి బయటపడి ఏపీలో టిడిపికి బలమైన ప్రత్యామ్నాయంగా వైసీపీని బలపరిచి, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించుకోగలిగారు. కానీ ఇంతవరకు ఆయన కల నెరవేరలేదు. కానీ ఈసారి అనూహ్యంగా పరిస్థితులు ఆయనకు అనుకూలంగా మారుతుండటంతో ఆయన కల నెరవేరే రోజు దగ్గరలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. 

ముందుగా ఆయనకు తెరాస నుంచి మద్దతు లభించడం చాలా అదృష్టమనే చెప్పాలి. ఎన్నికల వ్యూహాలు రచించడంలో సాటిలేని సిఎం కేసీఆర్‌ మద్దతు జగన్‌కు లభించడం చాలా అదృష్టమనే చెప్పాలి. కేసీఆర్‌ మద్దతు ఇస్తున్నందున, ఆయనకు సన్నిహితుడు మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా జగన్‌కు బేషరతుగా మద్దతు పలికారు. జగన్‌ కోరితే ఏపీకి వచ్చి వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం చేస్తానని ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌, బిజెపి, టిడిపిలను మట్టి కరిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. లోక్‌సభ ఎన్నికలలో తెరాస, వైసీపీలు కలిసి 35 ఎంపీ సీట్లు గెలుచుకొనే అవకాశం ఉందని ఓవైసీ జోస్యం చెప్పారు.    

ఇక ఏపీలో బిజెపి పోటీ చేసి గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కనుక, బిజెపి కూడా జగన్‌మోహన్‌రెడ్డితో రహస్య అవగాహన ఏర్పరచుకొందని ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. బెల్లం ఉన్నచోటిని పసిగట్టి చీమలు చేరినట్లే, ఏపీలో వైసీపీకి అనుకూల వాతావరణం ఏర్పడటాన్ని పసిగట్టిన అనేకమంది టిడిపి నేతలు నిర్మొహమాటంగా వైసీపీలో చేరిపోతున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ ఫిరాయింపులు మామూలే కానీ అధికార పార్టీని వీడి ప్రతిపక్ష పార్టీలోకి వలసలు కొనసాగుతుండటం గమనిస్తే ఏపీలో టిడిపికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, వైసీపీకి విజాయవకాశాలు మెరుగుపడ్డాయనే సంకేతంగా భావించవచ్చు. కనుక మొదటిసారిగా ఏపీలో జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత అనుకూలవాతావరణం కనిపిస్తోంది. పైగా అనేకమంది హేమాహేమీల మద్దతు లభిస్తోంది. కనుక కలిసివస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని జగన్‌ తన కల నెరవేర్చుకొంటారో లేదో చూడాలి.


Related Post