సిఎం కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి సూటి ప్రశ్న

March 02, 2019


img

అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబునాయుడును బూచిగా చూపించి ఘనవిజయం సాధించిన తెరాస, లోక్‌సభ ఎన్నికలలో గెలిచేందుకు మరో రకమైన వ్యూహం అమలుచేస్తోంది. తెలంగాణ ప్రజలు తమకు 16 సీట్లను ఇచ్చినట్లయితే, కేంద్రంలో చక్రం తిప్పుతామని, కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులు సాధించుకొంటామని సిఎం కేసీఆర్‌, కేటీఆర్‌ తదితరులు చెపుతున్నారు. అయితే కేవలం 16 సీట్లతో కేంద్రంలో ఏవిధంగా చక్రం తిప్పగలరు? ఒకవేళ బిజెపి లేదా కాంగ్రెస్‌ కూటములకు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తగినన్ని ఎంపీ సీట్లు గెలుచుకొంటే, ఆ 16 సీట్లతో కేంద్రం మెడలు ఏవిధంగా వంచగలరు? అనే ప్రశ్నలకు సమాధానంగా ‘ఈసారి లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌, బిజెపి కూటములు రెంటికీ మెజార్టీ రాదని' జోస్యం చెపుతున్నారు. 

ఒకవేళ తెరాస జోస్యం ఫలించి రెంటికీ మెజార్టీ రాకపోయినా ఆ రెండు పార్టీలు నేతృత్వం వహిస్తున్న కూటములలో ఏదో ఒకదానికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. సిఎం కేసీఆర్‌ స్వయంగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కలిసిన ప్రాంతీయ పార్టీలన్నీ అయితే కాంగ్రెస్‌ లేకుంటే బిజెపివైపు మొగ్గు చూపుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక ఆయన ప్రతిపాదిస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌లో ఎన్ని పార్టీలు ఉంటాయో, వాటన్నిటికీ కలిపి కాంగ్రెస్‌, బిజెపిల కంటే ఎక్కువ ఎంపీ సీట్లు సాధించుకోగలవని భావించలేము. సిఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌, బిజెపిలకు సమానదూరం పాటిస్తానని చెపుతున్న మాటకు కట్టుబడి ఉంటారనుకొంటే, ఆ 16 సీట్లతో ఏమి చేస్తారు? అనే సందేహం కలుగుతుంది. కనుక 16 ఎంపీ సీట్లు గెలుచుకోవడం కోసమే తెరాస ఈ చక్రం తిప్పుడు...మెడలు వంచుడు’ వ్యూహం అమలుచేస్తున్నట్లు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి కూడా అదే ప్రశ్న అడిగారు. 

ఈరోజు సిద్ధిపేటలో కాంగ్రెస్‌ కార్యాలయం ప్రారంభించినప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “16 ఎంపీ సీట్లు ఇస్తే సిఎం కేసీఆర్‌ ఏవిధంగా ఏమి చేస్తారో తెలంగాణ ప్రజలకు వివరించాలి. రంగనాయకసాగర్ భూనిర్వాసితుల తరపున నిలబడి పోరాడితే నాపై పోలీస్ కేసులు బనాయించి వేధిస్తున్నారు,” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Related Post