చేవెళ్ళ సీటును కొండా మళ్ళీ దక్కించుకొంటారా?

March 02, 2019


img

గత లోక్‌సభ ఎన్నికలలో తెరాస తరపున చేవెళ్ళ ఎంపీగా ఎన్నికైన కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెరాసకు గుడ్-బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఈసారి ఎన్నికలలో ఆయన తెరాస అభ్యర్ధితోనే పోటీ పడవలసిఉంటుంది. తెరాస తరపున మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పోటీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక బిజెపి తరపున ఆ పార్టీ సీనియర్ నేత కిషన్ రెడ్డి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి కూడా బలమైన అభ్యర్దే అయినప్పటికీ చేవెళ్ళలో పోటీ ప్రధానంగా కాంగ్రెస్‌, తెరాస అభ్యర్ధుల మద్యనే ఉండవచ్చు. 

అసెంబ్లీ ఎన్నికలలో 88 సీట్లు గెలుచుకొని ప్రభంజనం సృష్టించిన తెరాస లోక్‌సభ ఎన్నికలలో కూడా 16 సీట్లు ఖచ్చితంగా గెలుచుకొంటామని నమ్మకంగా చెపుతోంది. 16 లోక్‌సభ స్థానాలను గెలుచుకొని జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నారు కనుక చేవెళ్ళలో కొండా విశ్వేశ్వర్ రెడ్డికి తెరాస నుంచి గట్టి పోటీ అనివార్యమని స్పష్టం అవుతోంది. 

ఈ సంగతి ముందే గ్రహించిన ఆయన గతంలో తాను సామాజిక సేవా కార్యక్రమాల కోసం స్థాపించిన కేవీఆర్‌ ట్రస్టు, ప్రొగ్రెసివ్‌ తెలంగాణ వంటి స్వచ్ఛంద సంస్థల సహాయసహకారాలు తీసుకొంటూ గ్రామస్థాయిలో కొందరు కీలక వ్యక్తుల మద్దతును కూడగట్టేందుకు తెర వెనుక నిశబ్ధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

లోక్‌సభ ఎన్నికలలో పార్టీ జెండా, పేరు కంటే అభ్యర్ధుల స్వంత బలాన్ని బట్టే జయాపజయాలు ఉంటాయి. ఆవిధంగా చూసుకొన్నట్లయితే కొండా విశ్వేశ్వర్ రెడ్డికి విజయావకాశాలు ఉన్నట్లే. కానీ లోక్‌సభ ఎన్నికలను తెరాస కూడా చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది కనుక ప్రతీ ఒక్క సీటును గెలుచుకోవడానికి ప్రత్యేకవ్యూహాలు రచించుకొని బరిలో దిగడం తధ్యం. కనుక తెరాస అభ్యర్ధికి అదే శ్రీరామరక్షగా నిలుస్తుంది. 


Related Post