ప్రధానమంత్రి రేసులో మరో కొత్త అభ్యర్ధి?

March 01, 2019


img

లోక్‌సభ ఎన్నికలలో బిజెపి మళ్ళీ గెలిస్తే నరేంద్రమోడీ మళ్ళీ ప్రధానమంత్రి అవుతారని అందరికీ తెలుసు. కాంగ్రెస్‌ మిత్రపక్షాలు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని కాంగ్రెస్‌ భావిస్తోంది. కానీ కర్ణాటకకు చెందిన వ్యక్తి ప్రధానమంత్రి అవుతారని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పడం విశేషం. 

బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “గతంలో జెడిఎస్  పార్టీకి 16 లోక్‌సభ సీట్లు వచ్చినప్పుడు హెడి దేవగౌడ ప్రధాని అయ్యారు. త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌-జెడిఎస్ కూటమికి కర్ణాటక ప్రజలు మద్దతు తెలిపి 22 సీట్లు ఇచ్చినట్లయితే కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది,” అని అన్నారు. 

రెండు మూడు నెలల క్రితం ఓ సందర్భంలో ‘రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేందుకు మద్దతు ఇస్తామని’ కుమారస్వామి చెప్పారు. కానీ లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడిన తరువాత మాట మార్చి కర్ణాటకకు చెందిన వ్యక్తి ప్రధానమంత్రి అవుతారని చెప్పడం గమనిస్తే మాజీ ప్రధానిగా చేసిన ఆయన తండ్రి హెడి దేవగౌడ కూడా ప్రధానమంత్రి రేసులో చేరినట్లు భావించవచ్చు. 

బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటవుతున్న మహాకూటమిలో ఇప్పటికే రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ ప్రధానమంత్రి రేసులో ఉన్నారు. ఇప్పుడు వారితో పాటు ఆ జాబితాలో హెడి దేవగౌడ చేరినట్లు భావించవచ్చు. ఒకవేళ కర్ణాటకలో కాంగ్రెస్‌ కంటే జెడిఎస్ ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకొన్నట్లయితే, జెడిఎస్ ప్రధానమంత్రి పదవిని డిమాండ్ చేయబోతోందని కుమారస్వామి తాజా వ్యాఖ్య స్పష్టం చేస్తోంది. అంటే ఒకవేళ లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమి గెలిచినా, మమతా బెనర్జీ, దేవగౌడల నుంచి పోటీ ఉన్నందున రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేకపోవచ్చు.    

ఇక కాంగ్రెస్, బిజెపియేతర ఫెడరల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తున్న తెలంగాణ సిఎం కేసీఆర్‌ కూడా ప్రధానమంత్రి రేసులో ఉన్నారని తెరాస నేతలు సంకేతాలిస్తూనే ఉన్నారు. ఇంకా మాయావతి, శరద్ పవార్ తదితర నేతలు ప్రధానమంత్రి రేసులో ఉన్నారు. కనుక లోక్‌సభ ఎన్నికలలో దేశప్రజలు స్పష్టమైన తీర్పు చెప్పవలసిన అవసరం చాలా ఉంది. లేకుంటే ప్రధానమంత్రి పదవి కోసం జరిగే కీచులాటలలో కేంద్రంలో అస్థిర ప్రభుత్వం ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది.


Related Post