పాక్‌ ద్వంద వైఖరి: శాంతి కబుర్లు...కాల్పులు

March 01, 2019


img

పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ గురువారం పాక్‌ పార్లమెంటులో మాట్లాడుతూ తాము అల్లప్పుడూ శాంతినే కోరుకొంటామని, భారత్‌తో యుద్ధం చేయడం తమ అభిమతం కాదన్నారు. ఇరుదేశాల మద్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి మళ్ళీ శాంతి నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో తాను భారత్‌ ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడుడామంటే ఆయన నిరాకరిస్తున్నారని చెప్పారు. తన శాంతి ప్రతిపాదనలకు భారత్‌ సానుకూలంగా స్పందించనప్పటికీ, తాము శాంతి నెలకొల్పాలనే మంచి ఆలోచనతో పాక్‌కు బందీగా చిక్కిన భారత్‌ పైలట్ అభినందన్ వర్ధమాన్ ను శుక్రవారం బేషరతుగా విడిచిపెడతామని ప్రకటించారు. 

అక్కడ పార్లమెంటులో పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఈ మాటలు చెపుతున్న సమయంలోనే సరిహద్దుల వద్ద పాక్‌ సైనికులు భారత్‌ సరిహద్దు గ్రామాలపై గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కాల్పులు జరుపుతూనే ఉన్నారు. దాంతో సరిహద్దు గ్రామాలలో ప్రజలను భద్రతాదళాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అనేక గ్రామాలలో ప్రజలు బంకర్లలో, సమీపంలోని చెట్ల మద్య, భద్రతాదళాలు ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాలలో తలదాచుకొంటున్నారు. పరిస్థితుల తీవ్రతను చూస్తుంటే ఇప్పట్లో తమ ఇళ్లకు వెళ్ళే అవకాశం కనబడటం లేదని వారు చెపుతున్నారు. 

ఇరు దేశాల మద్య ఇంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండగా శుక్రవారం ఉదయం ఫిరోజ్‌పూర్‌లో బీఎస్‌ఎఫ్‌ క్యాంపును  ఫోటోలు తీస్తున్న ఒక పాక్‌ గుఢాచారిని భారత జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. అతనివద్ద నుంచి పాక్‌ సిమ్‌ కార్ట్‌తో ఉన్న ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ నేపధ్యంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ శాంతి ప్రవచనలను ఏవిధంగా నమ్మగలము?


Related Post