మేము ఏపీలో సభ నిర్వహించకూడదా? తలసాని

February 28, 2019


img

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇవాళ్ళ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “మేము గుంటూరులో యాదవ బీసీ గర్జనసభ నిర్వహించుకోవాలనుకొంటే, ఏపీ సిఎం చంద్రబాబునాయుడు ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆయన ఇక్కడకు వచ్చి సభలు, రోడ్ షోలు నిర్వహించుకొన్నప్పుడు మేమేమీ అభ్యంతరం చెప్పలేదు. ఆయనను అడ్డుకోలేదు. కానీ మేము గుంటూరులో బహిరంగసభ నిర్వహించుకోవాలనుకొంటె ఏపీ పోలీసులు అనుమతించడం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా బహిరంగసభలు నిర్వహించుకొనే హక్కు ఉంది. కానీ ఏపీలో మా సభ జరుగకుండా పోలీసుల చేత అడ్డుకొనేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఏపీ పోలీసులు మా సభకు అనుమతి నిరాకరిస్తే నేను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను,” అని హెచ్చరించారు. 

అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ, టిడిపితో పొత్తులు పెట్టుకొంటేనే తెరాస సహించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీని అడ్డంపెట్టుకొని చంద్రబాబునాయుడు మళ్ళీ రాష్ట్రంపై పెత్తనం సాగించడానికి ప్రయత్నిస్తున్నాడని, కనుక వారి కూటమికి ఓటేసి అధికారం కట్టబెడితే తెలంగాణ పగ్గాలు చంద్రబాబునాయుడు చేతిలోకి వెళ్ళిపోతాయంటూ తెరాస గట్టిగా వాదించి ప్రజలను ఒప్పించి విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. 

సరిగ్గా ఇప్పుడు అదేవిధంగా చంద్రబాబు కూడా ఏపీలో తెరాస జోక్యాన్ని  జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో బీసీలను కూడగట్టి టిడిపిని ఓడిస్తానని తలసాని స్పష్టంగానే చెపుతున్నారు. తనకు సవాలు విసురుతున్న చంద్రబాబును చూసి కేసీఆర్‌ ఏవిధంగా ఆందోళన చెందారో, ఇప్పుడు తలసాని చేస్తున్న ఈ ప్రయత్నాలను చూసి చంద్రబాబు కూడా అలాగే  ఆందోళన చెందుతున్నారు కనుకనే అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పవచ్చు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నమనే సంగతి విస్మరించి ఎవరికి వారు ఈ రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, గల్లీ..నా సొంత సామ్రాజ్యం... దీనిలోకి ఇతరులు ఎవరూ ప్రవేశించడానికి వీలులేదనుకోవడం వలననే ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని చెప్పవచ్చు. 


Related Post