భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలపై ట్రంప్ తాజా వ్యాఖ్యలు

February 28, 2019


img

ప్రస్తుతం వియత్నాంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ, “భారత్‌-పాక్‌ల మద్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు మా ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది. మా ప్రయత్నాలు ఫలించినట్లే ఉన్నాయి. భారత్‌-పాక్‌ల నుంచి ఒక ‘సానుకూలమైన సమాచారం’ మాకు అందింది. త్వరలోనే ఇరుదేశాల మద్య సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయని చెప్పగలను,” అని అన్నారు. 

భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు పెరిగిన తరువాత అమెరికా విదేశాంగమంత్రి భారత్‌-పాక్‌ విదేశాంగమంత్రులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరించినట్లు తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో చైనాతో సహా పలుదేశాలు పాకిస్థాన్‌ తీరునే తప్పుపడుతున్నాయి. 

బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు మరింత చొరవ తీసుకొని జైష్-ఏ-మహమ్మద్ సంస్థను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ఒక తీర్మానం ప్రవేశపెట్టాయి. భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల నేపద్యంలో ప్రపంచదేశాలన్నీ ఈ తీర్మానానికి మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఈ వేడిలో ఆ తీర్మానం ఆమోదం పొందినట్లయితే జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజర్‌పై పాకిస్థాన్‌ చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఒకవేళ పాకిస్థాన్‌ అందుకు అంగీకరిస్తే భారత్‌ కూడా వెనక్కు తగ్గవచ్చు. పాకిస్థాన్‌ నుంచి ఈమేరకు అమెరికాకు నిర్ధిష్టమైన హామీ లభించి ఉండవచ్చు. బహుశః అందుకే ఇరుదేశాల నుంచి ‘సానుకూల స్పందన’ వచ్చిందని డొనాల్డ్ ట్రంప్ చెపుతున్నారేమో? కానీ పాక్‌ వక్రబుద్ది అంత సులువుగా మారిపోతుందని ఆశించడం అత్యశే అవుతుంది.


Related Post