రాజకీయాలకు ఇదా సమయం?

February 28, 2019


img

ఒకపక్క శత్రుదేశం పాకిస్థాన్‌ ఏ క్షణంలోనైనా భారత్‌పై ప్రతీకారదాడి చేయడానికి కాసుకొనికూర్చోంది. ఈ సమయంలో కాంగ్రెస్‌ నేతృత్వంలో బిజెపియేతర 21 పార్టీలు డిల్లీలో సమావేశమయ్యి మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. పార్లమెంటులో లైబ్రెరీ హాలులో జరిగిన సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్‌, ఏకే ఆంటోనీ, అహ్మద్‌ పటేల్‌, చంద్రబాబునాయుడు, మమతా బెనర్జీ, శరద్‌యాదవ్‌, డెరిక్‌ ఓబ్రెయిన్‌, శిబూ సోరెన్‌, సీతారాం ఏచూరి తదితరులు పాల్గొని భారత్‌-పాక్‌ మద్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, లోక్‌సభ ఎన్నికల గురించి చర్చించారు.   

అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ, “భారత్‌ ఆర్మీ వాయుసేనల ధైర్యసాహసాలకు వారిని అభినందిస్తున్నాము. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్ల త్యాగాలకు నివాళులు ఆర్పిస్తున్నాము. అయితే వారి త్యాగాలను మోడీ ప్రభుత్వం స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని యత్నించడం చాలా దారుణం. అటువంటి ప్రయత్నాలను మేము ఖండిస్తున్నాము. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం దేశభద్రతను పణంగా పెట్టవద్దని మేము బిజెపికి, కేంద్రప్రభుత్వానికి సూచిస్తున్నాము. పాక్‌ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము,” అని అన్నారు. 

ఇంతకీ కాంగ్రెస్‌ మిత్రపక్షాల నేతలు చెప్పదలచుకొన్నదేమిటంటే, పుల్వామా దాడిని సాకుగా చూపుతూ కేంద్రప్రభుత్వం చేస్తున్న ఈ హడావుడి అంతా లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి అనుకూలవాతావరణం సృష్టించి ఎన్నికలలో గెలిచేందుకేనని!

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల వల్ల దేశప్రజలలో సెంటిమెంటు రగిలింది కనుక లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి మూకుమ్మడిగా ఓట్లు వేస్తారనే భయం కాంగ్రెస్‌ మిత్రపక్షాలలో కనిపిస్తోంది. అయితే ఆ మాట స్పష్టంగా చెపితే, ఇటువంటి క్లిష్ట సమయంలో రాజకీయాలు చేస్తునందుకు దేశప్రజలు తమను తిరస్కరిస్తారనే భయం కూడా వారిలో ఉంది. అందుకే మోడీ ప్రభుత్వంపై క్లుప్తంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ వారిమాటలను అర్ధం చేసుకోలేని స్థితిలో దేశప్రజలు లేరు. 

జాతి భద్రతను పణంగా పెట్టి మోడీ ప్రభుత్వం నీచరాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్‌ మిత్రపక్షాల వాదన పాకిస్థాన్‌ పాలకుల వాదనను దృవీకరిస్తున్నట్లుంది. కేంద్రప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించి అండగా నిలబడవలసిన ఇటువంటి కీలక సమయంలో కాంగ్రెస్‌ మిత్రపక్షాలు చేస్తున్న ఈ వాదన పాకిస్థాన్‌కు చేజెతులా ఒక బలమైన ఆయుధం అందించినట్లవుతుంది. రేపు అంతర్జాతీయవేదికలపై కాంగ్రెస్‌ మిత్రపక్షాల వాదనలనే పేర్కొని లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే భారత్‌ ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడుతోందని పాక్‌ వాదించకమానదు. అప్పుడు అంతర్జాతీయసమాజం ముందు భారత్‌ దోషిగా నిలబడే దుస్థితి రావచ్చు. కనుక ఇకనైనా కాంగ్రెస్‌ మిత్రపక్షాలు దేశభద్రతకు సంబందించిన సున్నితమైన ఈ అంశంపై రాజకీయాలు చేయకుండా ఉంటే మంచిది.


Related Post