డికె అరుణ మంచి ప్రశ్నే అడిగారు

February 28, 2019


img

లోక్‌సభ అభ్యర్ధుల జాబితాను ఖరారు చేసేందుకు టీపీసీసీ ఎన్నికల కమిటీ గాంధీభవన్‌లో సమావేశమైనప్పుడు డికె అరుణ-ఏఐ సిసి కార్యదర్శి సంపత్ కుమార్ మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మహబూబ్‌నగర్‌ నుంచి మాజీ కేంద్రమంత్రి, మాజీ ఎంపీ జైపాల్ రెడ్డి పేరును డికె అరుణ ప్రతిపాదించగా ఈసారి ఆయన లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదని టి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దానిపై డికె అరుణ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జైపాల్ రెడ్డి వంటి సీనియర్ నేతలు చొరవ తీసుకొని పార్టీని గెలిపించుకొనే ప్రయత్నం చేయకుండా వెనక్కు తగ్గడం ఏమిటని డికె అరుణ నిలదీశారు. ఆయన రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడనప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో తన అనుచరులకు టికెట్స్ ఎందుకు ఇప్పించుకొన్నారని గట్టిగా నిలదీశారు. చివరికి మహబూబ్‌నగర్‌ నుంచి వంశీ చంద్ రెడ్డి, జైపాల్ రెడ్డి పేర్లను జాబితాలో చేర్చారు. 

ఆ తరువాత నాగర్ కర్నూల్ నుంచి సతీష్ మాదిగ పేరును డికె అరుణ ప్రతిపాదించగా ఆమె మాటలకు సంపత్ కుమార్ అడ్డుతగులుతూ కేవలం ఆసక్తి, అర్హత ఉన్నవారి పేర్లను మాత్రమే జాబితాలో చేర్చాలని సూచించడంతో సంపత్ కుమార్ పై కూడా ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్-ఛార్జ్ ఆర్.సి.కుంతియా ఆమెను సమర్ధించారు. కానీ ఆ నియోజకవర్గం నుంచి మల్లు రవి, సంపత్ కుమార్ల పేర్లను జాబితాలో చేర్చారు.

రాష్ట్రంలో...దేశంలో కాంగ్రెస్ పార్టీ అనుకూలవాతావరణం, విజయావకాశాలు కనిపిస్తున్నప్పుడు పార్టీలో సీనియర్లు తమకే టికెట్లు ఇవ్వాలని పట్టుబడుతుంటారు. అది సహజమే కానీ పార్టీ ఎదురీదవలసి ఉంటుందని గ్రహించిన్నప్పుడు జైపాల్ రెడ్డివంటి సీనియర్ నేతలు పోటీకి వెనుకంజవేయడం డికె అరుణ చెప్పినట్లు పార్టీకి మరింత నష్టం చేకూర్చే చర్యేనని చెప్పవచ్చు. గతంలో  కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రమంత్రి పదవిని అనుభవించిన జైపాల్ రెడ్డి, రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని ఆశపడినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. 

పార్టీ ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు పదవులు, అధికారం అన్ని అనుభవించి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు...పార్టీకి ఎంతో కీలకమైన లోక్‌సభ ఎన్నికల సమయంలో జైపాల్ రెడ్డి దూరంగా ఉండాలనుకోవడం విస్మయం కలిగిస్తుంది. కనుక జైపాల్ రెడ్డి విషయంలో డికె అరుణ వాదన, అభిప్రాయం సరైనవేనని చెప్పక తప్పదు. 


Related Post