రాత్రయితే కనపడదు కానీ...రెండు విమానాలు కూల్చేశారట!

February 27, 2019


img

భారత్‌ మెరుపుదాడులపై పాక్‌ రక్షణమంత్రి పర్వీజ్ ఖట్టక్ స్పందనపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమ్మన్నారంటే, “భారత్‌ ఎటువంటి దుస్సాహసానికి పూనుకొన్న తిప్పి కొట్టేందుకు పాక్‌ వాయుసేన సిద్ధంగా ఉంది. కానీ భారత్‌ యుద్ధవిమానాలు రాత్రిపూట చీకటిగా ఉన్నప్పుడు వచ్చి దాడులు చేయడంతో వాటిని ఎదుర్కోలేకపోయాము. తెల్లవారగానే మా వాయుసేన ఆ ప్రాంతాన్ని పరిశీలించి వచ్చి పూర్తి వివరాలు అందజేసింది. కనుక ఇకపై భారత్‌ మళ్ళీ ఎటువంటి దుస్సాహాసం చేసినా  తిప్పికొట్టడానికి పాక్‌ సిద్దంగా ఉంది,” అని చెప్పారు. 

యుద్ధంలో రాత్రి పగలు, వెలుగు చీకటి అనే తేడా ఉండదని అందరికీ తెలుసు. శత్రువు ఏ సమయంలోనైనా దాడి చేసే అవకాశం ఉంటుంది కనుక ఎప్పుడంటే అప్పుడు ఎదురుదాడి చేయగల సత్తా కలిగి ఉండాలి. కానీ చీకటి కారణంగా ఏమీ చేయలేకపోయామని పాక్‌ రక్షణమంత్రి చెప్పుకొని తన దేశాన్ని నవ్వులపాలుచేశారు. 

ఇవాళ్ళ మధ్యాహ్నం పాకిస్థాన్‌ మిలట్రీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసీఫ్ గఫూర్ మాట్లాడిన మాటలతో తనదేశాన్ని మరోసారి నవ్వులపాలు చేశారు. “భారత్‌ వాయుసేనకు చెందిన రెండు యుద్దవిమానాలను ఇవాళ్ళ నేలకూల్చాము. వాటిలో ఒకటి పాక్‌ సరిహద్దులలో కూలిపోగా మరొకటి భారత్‌ సరిహద్దులలో కూలిపోయింది. పాక్‌లో కూలిన విమాన పైలట్ ను బందీగా పట్టుకొన్నాము,” అని చెప్పారు. 

నిజానికి ఇవాళ్ళ మన విమానాలు పాక్‌ వైపు వెళ్ళనేలేదు. కశ్మీర్ సరిహద్దులో గస్తీ తిరుగుతున్న ఒక మిగ్ విమానం సాంకేతికలోపం కారణంగా శ్రీనగర్‌కు సుమారు 7 కిమీ దూరంలో బుడగావ్ వద్ద కూలిపోయిందని వాయుసేన స్వయంగా ప్రకటించింది. దానితో తమకు సంబందం లేదని పాక్‌ కూడా ప్రకటించింది. మరి పాక్‌లోకి భారత్‌ విమానాలు వెళ్లనప్పుడు పాక్‌ ఏ విమానాలను కూల్చింది అంటే రెండేళ్ల క్రితం సాంకేతిక లోపంతో రాజస్థాన్ లో కూలిపోయిన మిగ్ విమానం వీడియోను ఇప్పుడు చూపిస్తోంది. 

తాజా సమాచారం ప్రకారం ఈరోజు భారత్‌ భూభాగంలోకి పాక్‌ వాయుసేన యుద్దవిమానాలు ప్రవేశించినప్పుడు భారత్‌ వాయుసేన జరిపిన ఎదురుదాడిలో పాకిస్థాన్‌కు చెందిన ఒక ఎఫ్-16 యుద్దవిమానం పాక్‌ సరిహద్దులో కూలిపోయినట్లు తెలుస్తోంది. కానీ దాని పైలట్ సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. వాస్తవయుద్ధానికి ఏమాత్రం తీసిపోనివిధంగా భారత్‌-పాక్‌ మీడియాలో ఇటువంటి యుద్దాలు జరుగుతుండటం విశేషం. 



Related Post