భారత్-పాక్‌లకు చైనా సుద్దులు

February 26, 2019


img

భారత్‌ వాయుసేన దాడులతో భారత్‌-పాక్‌ మద్య ఉద్రిక్తవాతావరణం పతాకస్థాయికి చేరుకొంది. ఒకపక్క తమ దేశమాపి ఎటువంటి దాడి జరుగలేదని వాదిస్తూనే, భారత్‌కు ధీటుగా జవాబిస్తామని పాక్‌ హెచ్చరిస్తోంది. పాక్‌ ప్రజలు, సైన్యం ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ పిలుపునివ్వడంతో పాక్‌ కూడా ప్రతీకారదాడి చేసే అవకాశం కనిపిస్తోంది. 

ఈ పరిణామాలపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లూకాంగ్ బీజింగ్ లో మీడియాతో మాట్లాడుతూ, “దక్షిణాసియాలో భారత్‌-పాకిస్థాన్‌ రెండూ ప్రధానమైన దేశాలే. దక్షిణాసియాలో శాంతి, సుస్థిరతలను నెలకొల్పవలసిన బాధ్యత ఆ రెండు దేశాలకు ఉంది. రెండు దేశాలు సంయమనం పాటించి, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తాయని ఆశిస్తున్నాము. ఈరోజు భారత్‌ చేసిన దాడి ‘నాన్-మిలటరీ’ దాడి.  ఉగ్రవాదంపై పోరాడాలంటే అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా, ప్రపంచ దేశాల సహకారంతో పోరాడటం సరైన  పద్దతి,” అని అన్నారు.          

చైనా ఇప్పుడు చెపుతున్న అంతర్జాతీయవిధానాలతోనే భారత్‌ గత మూడున్నర దశాబ్ధాలుగా పాకిస్థాన్‌ను కట్టడి చేయాలని విఫలయత్నాలు చేసింది. అంతర్జాతీయస్థాయిలో శాంతియుత పద్దతులతో భారత్‌ చేస్తున్న ఆ ప్రయత్నాలకు చైనా పదేపదే కాలు అడ్డుపెట్టింది. జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించి అతనిపై చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి భధ్రతామండలిలో భారత్‌ ప్రయత్నించిన ప్రతీసారి చైనా అడ్డుపడింది. పుల్వామా దాడి తరువాత కూడా చైనా అదేవిధంగా వ్యవహరించింది. 

పాకిస్థాన్‌ పాలకులు, సైన్యాధికారులు ఉగ్రవాదులకు ఆశ్రయం, శిక్షణ, రక్షణ కల్పిస్తున్నారని చైనాకు తెలిసి ఉన్నప్పటికీ, ‘మేడ్-ఇన్-పాక్‌ ఉగ్రవాదులు’ భారత్‌కు పక్కలో బల్లెంలా ఉండటమే చైనాకు మంచిదనే దురాలోచనతోనే పాకిస్థాన్‌కు అండగా నిలబడుతోందని చెప్పవచ్చు. చేయకూడని ఈ పనులన్నీ చేసి ఇప్పుడు శాంతి, సంయమనం అంటూ సుద్దులు చెపుతోంది. 

భారత్‌ సహనం కోల్పోతే ఇటువంటి పరిస్థితులు దాపురిస్తాయని తెలిసి ఉన్నప్పటికీ, చైనా అండదండలు చూసుకొని పాక్‌ కూడా రెచ్చిపోయింది. ఇప్పుడు అందుకు ఫలితం అనుభవించింది. అయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం మానుకోలేదు. చైనాకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే, పాకిస్థాన్‌ను అదుపులో పెట్టి ఆ దేశం నుంచి ఉగ్రవాదులను ఏరిపారేసే ప్రయత్నం చేయాలి. ఆపని చేయగలిగితే పాక్‌ బాగుపడుతుంది. పాక్‌ బుద్దిగా ఉంటే భారత్‌ కూడా అటువైపు కన్నెత్తి చూడదు.


Related Post