వైమానిక దాడులపై పాక్‌ స్పందన

February 26, 2019


img

ఈరోజు తెల్లవారుజామున భారత వాయుసేన చేసిన దాడులపై పాక్‌ అధికారికంగా స్పందించింది. పాకిస్థాన్‌ విదేశాంగమంత్రి షా మహమ్మద్ ఖురేషీ ఇస్లామాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “త్వరలో జరుగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడింది. అయితే ఈ దాడులు చూసి మేము భయపడిపోబోము. అంతర్జాతీయ నిబందనలను ఉల్లంఘించి భారత్ వాయుసేన ఆకస్మికంగా మా దేశంలో జొరబడి మమ్మల్ని దెబ్బ తీయాలని తీయాలని చూసింది. కనుక ఆత్మరక్షణ కోసం ఇప్పుడు మేము కూడా ప్రతిచర్య తీసుకొనే అవకాశం మాకు లభించింది ఇప్పుడు. మేము కూడా తగినవిధంగా సమాధానం చెపుతాము,” అని అన్నారు. 

ఈ దాడిపై మొదట స్పందించిన పాక్‌ ఇంటర్ సర్వీసస్ పబ్లిక్ రిలేషన్స్ చీఫ్ మేజర్ జనరల్ ఆసీఫ్ గఫూర్, “భారత వాయుసేనకు చెందిన యుద్ధవిమానాలు మా సరిహద్దులలోకి ప్రవేశించబోతే మా వాయుసేన వెంటనే అడ్డుకోవడంతో భారత వాయుసేన విమానాలు వెనక్కు వెళ్లిపోయాయి. తప్పించుకొని పారిపోయేటప్పుడు వాటిలో ఒకటి బాల్కోట్ వద్ద ఒక బాంబును జారవిడిచింది,” అని అన్నారు. 

అంటే పాక్‌ భూభాగంలో భారత్‌ ఎటువంటి దాడి చేయలేదని దృవీకరించినట్లే. కానీ కొన్ని గంటల వ్యవదిలోనే పాక్‌ అందుకు భిన్నంగా స్పందించడం విశేషం. 

పాక్‌ ప్రేరిత ఉగ్రవాదులు పఠాన్ కోట్ లోని భారతవైమానిక స్థావరంపై, యూరీలోని భారత ఆర్మీ క్యాంపుపై, పుల్వమాలోని ఆర్మీ కాన్వాయ్ పై పాక్‌ ఉగ్రవాదులు దాడులు చేసి మన సైనికులను బలిగొన్నప్పుడు అవేవీ పాక్‌ పాలకులకు తప్పుగా అనిపించలేదు. పైగా ఎన్నికల కోసమే భారత్‌ ప్రభుత్వం ఈ కొత్తనాటకానికి తెర తీసిందని చాలా నీచంగా వాదిస్తోంది కూడా. ఇప్పుడు పాక్‌ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ దాడులు చేస్తే అది తమ దేశంపై దాడిగా పాక్‌ అభివర్ణిస్తోంది.

గత మూడున్నర దశాబ్ధాలుగా పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు, వేర్పాటువాదులు భారత్‌లో అల్లకల్లోలం సృష్టిస్తూనే ఉన్నా భారత్‌ చాలా సంయమనం పాటించింది. కానీ భారత్‌ సహనం పాక్‌ పాలకులకు అసమర్దతగా కనిపిస్తోంది. అందుకే భారత్‌తో మూడున్నర దశాబ్ధాలుగా నిరంతరం పరోక్షయుద్దం చేస్తునే ఉంది. కానీ ఇప్పుడు భారత్‌ వారికి ధీటుగా జవాబిస్తుంటే, ‘ఇంతకాలం సహనం వహించిన భారత్‌ ఇప్పుడు ఈవిధంగా ఎందుకు చేస్తోంది? అని ఆలోచించకుండా తమ దేశంపై భారత్‌ దాడులు చేస్తోందని ఆక్రోశిస్తున్నారు. మరి గత మూడున్నర దశాబ్ధాలుగా భారత్‌ ఆక్రోశం మాటేమిటి? భారత్‌ హెచ్చరికలను పెడచెవిన పెట్టడంవలననే పాకిస్థాన్‌కు నేడు ఈ దుస్థితి, అవమానకర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తోంది. చివరిగా ఒక మాట చెప్పుకోవాలి. ఈ ఏడు దశాబ్ధాలలో భారత్‌ను అస్థిరపరచడానికి పాక్‌ పాలకులు చేసిన కృషిని తమ దేశాన్ని అభివృద్ధి చేసుకొనేందుకు వినియోగించుకొని ఉండి ఉంటే నేడు పాకిస్థాన్‌ కూడా భారత్‌తో సమ ఉజ్జీగా ఉండేది కదా!


Related Post