అందుకే రెవెన్యూశాఖను అట్టేబెట్టుకొన్నా: కేసీఆర్‌

February 26, 2019


img

 ఓట్-ఆన్‌-బడ్జెట్‌పై శాసనసభలో నిన్న జరిగిన చర్చలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “కీలకమైన శాఖలు నా దగ్గర పెట్టుకొన్నానని కొందరు విమర్శిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. వారికి నేను చెప్పే సమాధానం ఏమిటంటే, యస్! ఒక ముఖ్య కారణంతోనే వాటిని నావద్ద అట్టేబెట్టుకొన్నాను. రాష్ట్రంలో భూరికార్డుల సమూల ప్రక్షాళన చేశాము. మరొక 5-6 నెలలలో ధరణి వెబ్‌సైటు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. గతంలోలాగ రైతులు భూసమస్యలపై రిజిస్టార్ ఆఫీసులు, పంచాయతీలు, కోర్టుల చుట్టూ తిరిగే పనిలేకుండా చేయాలనేదే మా లక్ష్యం. అత్యంత సరళమైన, అత్యంత ఖచ్చితమైన రికార్డులను రూపొందించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాము.

మరొకసారి అత్యాధునిక జీపీఎస్ పరికరాలతో సమగ్ర భూసర్వే నిర్వహించి రాష్ట్రంలో భూములున్న రైతులందరికీ ‘కంక్లూజీవ్ టైటిల్’ ఇస్తాము. దానితో వారికి నూటికి నూరుశాతం యాజమాన్యపుహక్కులను దృవీకరిస్తాము. అది ప్రభుత్వం తరపున హామీగా ఉంటుంది. దానిలో ఎటువంటి తేడాలున్నా వాటికి ప్రభుత్వమే బాధ్యత వహించేవిధంగా నిబందనలు రూపొందిస్తున్నాము.

ఎక్కడా అవినీతికి తావులేకుండా, రైతులు పైసా ఖర్చు చేయకుండా చాలా సులువుగా తమ భూముల క్రయవిక్రయాలు చేసుకొనేందుకు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలను పొందేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ పనులన్నీ పూర్తికావాలంటే ఆ శాఖను నేను స్వయంగా పర్యవేక్షించాలి. అందుకే రెవెన్యూ శాఖను నా వద్దే అట్టేబెట్టుకొన్నాను,” అని చెప్పారు.


Related Post