అవును దాడులు చేశాం: భారత్

February 26, 2019


img

ఈరోజు తెల్లవారుజామున భారత్‌ వాయుసేన చేసిన దాడులను భారత ప్రభుత్వం దృవీకరించింది. భారత్‌ విదేశాంగశాఖ కార్యదర్శి విజయ్ గోఖలే కొద్దిసేపటి క్రితం డిల్లీలో మీడియా సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. 

“గత దశాబ్ధకాలంగా భారత్‌పై జరుగుతున్న పాక్‌ ఉగ్రదాడులకు సంబందించి అనేకఆధారాలను మేము పాక్‌ ప్రభుత్వానికి సమర్పించి, పాక్‌లో ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవలసిందిగా కోరాము. కానీ దురదృష్టవశాత్తు పాక్‌ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ కారణంగా పాక్‌లో శిక్షణపొందిన ఉగ్రవాదులు మళ్ళీ పుల్వమాలో మా సైనికులపై దాడులు చేసి 40మందిని బలిగొన్నారు. కనుక ఈ ఘాతుకానికి పాల్పడిన జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థపై చర్యలు అనివార్యమయ్యాయి. 

పాక్‌ సరిహద్దుల వెంబడి వందలాది ఉగ్రవాద శిబిరాలున్నాయని మాకు పక్కా సమాచారం ఉంది. జనావాసాలకు దూరంగా కొండల మద్య ఉన్న ఆ ప్రాంతంలో జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ శిబిరాలపై మావాయుసేన ఈరోజు తెల్లవారుజామున దాడులుచేసి వారిని మట్టుబెట్టింది. 

ఈ దాడులను పాకిస్థాన్‌పై చేస్తున్న దాడులుగా భావించరాదు. ఉగ్రవాద శిబిరాలనే లక్ష్యంగా చేసుకొని మావాయుసేన దాడులు చేసింది తప్ప  సామాన్య ప్రజలకు ఎటువంటి హానీ కలిగించలేదు. ఇది మా సైనికులను బలిగొన్న ఉగ్రవాదులపై చేసిన దాడి మాత్రమే. ఈ దాడికి సంబందించి పూర్తి వివరాలు ఇంకా అందవలసి ఉంది. అందిన తరువాత ఆ వివరాలను మీడియాకు వెల్లడిస్తాము,” అని తెలిపారు. 

భారత్‌ దాడిపై పాక్‌ పార్లమెంటులో పెద్దలసభ (రాజ్యసభ) అత్యవసరంగా సమావేశమయ్యి ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. జఫార్ ఉల్ హక్ అనే ఎంపీ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ‘పాక్‌పై భారత్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. త్వరలో భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి కనుకనే భారత్‌ ప్రభుత్వం ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. పాక్‌ శక్తిని తక్కువగా అంచనా వేయవద్దని భారత్‌ పాలకులను హెచ్చరిస్తున్నాము,” అని తీర్మానంలో పేర్కొన్నారు.


Related Post