ప్రతిదాడికి పాక్‌ సాహసిస్తుందా?

February 26, 2019


img

ఈరోజు తెల్లవారుజామున భారతవాయుసేనకు చెందిన 12 యుద్ధవిమానాలు వాస్తవాధీనరేఖను దాటి పాక్‌ భూభాగంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసాయి. ఆ దాడిలో సుమారు 300 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఒకవేళ పాక్‌పై దాడికి భారత్ ప్రయత్నిస్తే పాక్‌ ధీటుగా ఎదురుదాడి చేస్తుందని పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ నాలుగు రోజుల క్రితం ప్రకటించిన నేపధ్యంలో, ఇప్పుడు పాక్‌ కూడా భారత్‌పై ఎదురుదాడి చేస్తుందా? చేస్తే దానిని భారత్ ఏవిధంగా ఎదుర్కొనబోతోంది?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

అయితే గతంలో భారత ఆర్మీ జవాన్లు వాస్తవధీనరేఖను దాటి పాక్‌ భూభాగంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు (సర్జికల్ స్ట్రైక్స్) చేసినప్పుడు, అటువంటిదేమీ జరుగలేదని పాక్‌ సైన్యం, పాక్‌ పాలకులు వాదించారు. కానీ జరిగిందేమిటో పాకిస్థాన్‌కు తెలుసు...యావత్ ప్రపంచానికి తెలుసు. 

ఈరోజు భారత వాయుసేన దాడులు జరిపి తిరిగి వెళ్ళిపోయిన తరువాత కూడా పాక్‌ వాయుసేన చీఫ్ మళ్ళీ అదేవిధంగా మాట్లాడటం గమనిస్తే, భారత్‌పై ఎదురుదాడి చేసే దుస్సాహాసం పాక్‌ చేయదని అర్దమవుతోంది. 

“భారత వాయుసేన విమానాలు మా భూభాగంలోకి ప్రవేశించబోతే వాటిని మా వాయుసేన తరిమికొట్టిందని” చెప్పుకొన్నారు. ఈరోజు కూడా ‘పాక్‌ భూభాగంపై భారత్‌ ఎటువంటి దాడి చేయలేదని’ పాక్‌ చెప్పుకొంటోంది కనుక భారత్‌పై ఎదురుదాడి చేయడానికి పాక్‌ వద్ద కారణమేదీలేనట్లే. ఒకవేళ భారత్‌పై దాడులు చేయాలని పాక్‌ పాలకులు ఆలోచనలు చేసినా అమెరికా తదితర అగ్రదేశాల ఆగ్రహానికి గురికావలసి ఉంటుంది. కనుక పాక్‌ అటువంటి దుస్సాహసానికి పూనుకోకపోవచ్చు. తెగించి పూనుకొంటే అందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదు కనుక యధాప్రకారం పాక్‌ ఉగ్రవాదులతో భారత్‌పై దాడులు చేయించి ప్రతీకారం తీర్చుకొనే ప్రయత్నం చేయవచ్చు. 

ఇప్పుడు పాక్ నుంచి మరింత ప్రమాదం పొంచి ఉన్నందున, జమ్ము కాశ్మీరులో భారత్-పాక్ సరిహద్దు ప్రాంతాలలో ఆర్మీ హై అలర్ట్ ప్రకటించింది. ముందుజాగ్రత్త చర్యగా త్రివిద దళాలలో శలవులు రద్దు చేసి అందరూ అప్రమత్తంగా ఉండాలని రక్షణశాఖ ఆదేశించింది.  


Related Post