పాక్‌ వలలో మళ్ళీ భారత్‌ చిక్కుకోనుందా?

February 25, 2019


img

పుల్వామా ఉగ్రదాడితో భారత్-పాక్‌ మద్య మళ్ళీ ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. జమ్ముకశ్మీర్‌కు కేంద్రప్రభుత్వం 10,000 మంది సాయుధదళాలను తరలించడంతో ఇరుదేశాల మద్య భయానకమైనదేదో జరుగబోతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈసమయంలో ఒక అనూహ్యపరిణామం జరిగింది. 

పుల్వామా దాడితో పాకిస్థాన్‌కు ఎటువంటి సంబంధమూ లేదని, ఒకవేళ ఉందని భారత్ భావిస్తున్నట్లయితే అందుకు ఆధారాలు ఇస్తే దర్యాప్తు చేయించి నిజానిజాలు తెలుస్తానని పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. తాను పఠాన్ వంశానికి చెందినవాడినని ఆడిన మాట తప్పనని అన్నారు. 

ప్రధాని నరేంద్రమోడీ స్పందిస్తూ ‘మాట నిలబెట్టుకొంటారా?’ అని సవాలు విసిరారు. దానికి ఇమ్రాన్ ఖాన్ సానుకూలంగా స్పందించారు. ఆధారాలు సమర్పిస్తే దర్యాప్తు జరిపించి నిజానిజాలు తేల్చుతామని, శాంతి నెలకొల్పేందుకు తమకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోడీకి పాక్‌ ప్రధాని కార్యాలయం విజ్ఞప్తి చేసింది. దీనిపై భారత్ ఇంకా స్పందించవలసి ఉంది. 

పుల్వామా ఉగ్రదాడి తరువాత అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌కు, ఆ సమస్య నుంచి బయటపడేందుకు మోడీ విసిరిన ఈ సవాలు బాగా ఉపయోగపడిందని చెప్పవచ్చు. ఎందుకంటే, గతంలో పఠాన్ కోట్ యుద్ధవిమానాశ్రయంపై పాక్ ఉగ్రవాదులు దాడి చేసిన తరువాత పాక్‌ ప్రభుత్వం సరిగ్గా ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులనే ఎదుర్కొంది. అప్పుడు ఇదేవిధంగా దర్యాప్తు పేరుతో సాగదీసి తప్పించుకొంది.

ముంజేతి కంకణాన్ని చూసుకొనేందుకు అద్దం ఎందుకన్నట్లు, “పుల్వామా దాడికి మేమే బాధ్యులమని” పాక్‌లో తిష్టవేసిన జైష్-ఏ-మహమ్మద్ గర్వంగా ప్రకటించుకొన్నాక, మళ్ళీ ఆ దాడికి సూత్రదారులు ఎవరు? వారికి ఎవరు సహకరించారు? ఏవిధంగా దాడి చేశారు? అని భారత్ చెప్పవలసిన అవసరం లేదు. 

నిద్రపోతున్న వాడిని లేపగలము కానీ నిద్ర నటిస్తున్నవాడిని లేపలేమన్నట్లు పాక్‌ పాలకుల కంటెదురుగా తిరుగుతున్న జైష్-ఏ-మహమ్మద్ అధినేత మసూద్ అజర్ తిరుగుతుంటే చూడనట్లు నటిస్తూ, మళ్ళీ ‘పుల్వామా దాడికి ఆధారాలు చూపండి’ అని అడగడం పాక్‌ కుటిలబుద్ధికి నిదర్శనం. ఒకవేళ పాక్‌ ఉచ్చులో మళ్ళీ భారత్ చిక్కుకొన్నట్లయితే, పఠాన్ కోట్ కధ ఏవిధంగా అర్ధాంతరంగా ముగిసిందో, ఇదీ అదేవిధంగా ముగియడం ఖాయం. అయినా ఇమ్రాన్ ఖాన్‌కు ఉగ్రవాదులను పట్టుకొని శిక్షించేoత గుండె ధైర్యం, నిజాయితీ ఉన్నట్లయితే వెంటనే దర్యాప్తుకు ఆదేశించవచ్చు కదా? దానికి భారత్ సహకారం ఎందుకు?


Related Post