తెలంగాణ మంత్రివర్గంలో ఇద్దరికి ఛాన్స్!

February 23, 2019


img

ఓటాన్-అకౌంట్-బడ్జెట్‌పై నేడు శాసనసభలో చర్చ జరుగుతున్నా సందర్భంలో సభలో సిఎం కేసీఆర్‌ ఒక ముఖ్య ప్రకటన చేశారు. ఈసారి తన మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు స్థానం కల్పించబోతున్నానని చేపపారు. మహిళల పట్ల తనకు చాలా గౌరవం ఉందని, వారిని ఎన్నడూ నిర్లక్ష్యం చేయనని చెప్పారు.

ఇద్దరు మహిళా మంత్రులను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు ప్రకటించారు కనుక ఇప్పుడు వారిద్దరూ ఎవరనే చర్చ మొదలవుతుంది. ఈసారి తెరాసలో పద్మా దేవేందర్ రెడ్డి, గొంగడి సునీతా రెడ్డి, రేఖా నాయక్ ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలున్నారు. వారిలో ఇద్దరికి అవకాశం లభించబోతోంది.

గత ప్రభుత్వంలో డెప్యూటీ స్పీకరుగా ఎంతో సమర్ధంగా బాధ్యతలు నిర్వర్తించిన పద్మా దేవేందర్ రెడ్డిని ఈసారి మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు సమాచారం. రెడ్డి సామాజిక వర్గానికి ఆమెను మంత్రిగా తీసుకొన్నట్లయితే అదే సామాజిక వర్గానికి చెందిన గొంగడి సునీతా రెడ్డికి అవకాశం లభించకపోవచ్చు. కనుక రేఖా నాయక్ కు అవకాశం లభించవచ్చు. 

వారిరువురూ కాక ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికవబోతున్న సత్యవతి రాథోడ్ కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరిద్దరు మహిళా నేతలు తెరాసలో చేరే అవకాశమున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక వారిని పార్టీలోకి ఆకర్షించడానికి వారిలో ఒకరికి మంత్రిపదవి ఇచ్చినా ఆశ్చర్యం లేదు. 


Related Post