ట్రంప్ పాక్‌ను గాడిలో పెట్టగలరా?

February 23, 2019


img

పుల్వామా ఉగ్రదాడి తదనంతర పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. “పుల్వామా ఉగ్రదాడిలో అనేకమంది చనిపోవడం బాధాకరం. ఆ దాడి తరువాత భారత్-పాక్‌ మద్య చాలా భయానక పరిణామాలు జరుగుతున్నాయి. అవి చాలా ప్రమాదస్థాయిలో ఉన్నాయి. రెండు దేశాల మద్య సంబంధాలు చాలా చెడిపోయాయి. రెండు దేశాలు తక్షణమే నష్టనివారణ చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇరు దేశాలతో మా ప్రభుత్వం చర్చలు జరుపుతూ ఉద్రిక్తతలు తగ్గించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఉగ్రవాద నివారణకు భారత్‌కు అవసరమైన సహాయసహకారాలు అందించడానికి మేము సిద్దంగా ఉన్నాము,” అని అన్నారు.

భారత్‌పై అనేకసార్లు పాక్‌ ప్రేరిత ఉగ్రదాడులు జరిగాయి. అనేకవందల మంది ప్రజలు, జవాన్లు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఇక కాశ్మీరులో పాక్‌ ప్రేరిత వేర్పాటువాదులతో భారత్ నిత్యం సమస్యలను ఎదుర్కొంటూనే ఉంది. కానీ ఏనాడూ పాక్‌తో ప్రత్యక్షయుద్దం చేస్తామని భారత్ చెప్పలేదు. కానీ ఇటువంటి ఉద్రిక్తపరిస్థితులు తలెత్తిన ప్రతీసారి పాకిస్థాన్‌ మాత్రం ‘భారత్‌తో ప్రత్యక్ష యుద్దానికి సిద్దమని, భారత్‌పై అణుబాంబులు ప్రయోగిస్తామంటూ’ కవ్వింపు ప్రకటనలు చేస్తూనే ఉంది. అయినప్పటికీ భారత్ ఎన్నడూ సంయమనం కోల్పోలేదు. ఎందుకంటే, యుద్ద పర్యవసనాలు ఎంత భయానకంగా ఉంటాయో భారత్‌కు తెలుసు. అందుకే శాంతియుత పద్దతులలోనే పాకిస్థాన్‌ను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తోంది. అవి ఫలించకపోవడం వేరే సంగతి.  

కానీ ఈ సమస్య ఎప్పటికైనా పరిష్కరించవచ్చా అంటే లేదనే చెప్పక తప్పదు. ఎందుకంటే, భారత్‌లోలాగ పాకిస్థాన్‌ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్చ, అధికారం లేవు. ఒకపక్క మసూద్ అజర్ వంటి కరడుగట్టిన ఉగ్రవాదులు, మరోపక్క వారికి వంతపాడే యుద్ధోన్మాదులైన సైనికాధికారులు పాక్‌ ప్రభుత్వాన్ని పరోక్షంగా నియంత్రిస్తుంటారు. కనుక పాక్‌ ప్రభుత్వం వారి ఆలోచనలకు అనుగుణంగా వారి కనుసన్నలలోనే పనిచేయవలసి ఉంటుంది. అందుకే పాక్‌ పాలకులు భారత్‌తో స్నేహసంబందాలు మెరుగుపరుచుకోవాలనుకొంటున్నప్పటికీ భారత్ పట్ల తప్పనిసరిగా వ్యతిరేకత ప్రదర్శించవలసి వస్తోందని చెప్పవచ్చు. కనుక పాక్‌లో ఈ పరిస్థితులు మారనంతవరకు భారత్‌పై ఇటువంటి దాడులు జరుగుతూనే ఉండవచ్చు. ఏడు దశాబ్ధాలుగా పాక్‌లో నెలకొన్న ఈ పరిస్థితులు మారనప్పుడు ఇక ముందు మారుతాయనుకోవడం అత్యశే అవుతుంది. కనుక భారత్‌పై పాక్‌ ఉగ్రవాదుల దాడులు జరుగుతూనే ఉండవచ్చు. ఆ కారణంగా ఇరుదేశాల మద్య ఉద్రిక్త పరిస్థితులు పునరావృతం అవుతూనే ఉంటాయి. కనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సహా ఎవరైనాసరే తాత్కాలికంగా ఈ మంటలను, వేడిని చల్లార్చగలరే తప్ప మరేమీ చేయలేకపోవచ్చు. 

కనుక భారత్ పరిస్థితి ఏవిధంగా ఉందంటే పొరుగింటికి మంటలు అంటుకుంటే వాటిని ఆర్పలేక, ఆ మంటల సెగలు తగులుతుంటే ఆ వేడిని, బాధను భరిస్తూ ఇంటిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుంది.


Related Post