కాంగ్రెస్‌కు కేసీఆర్‌ మరోసారి జలక్

February 22, 2019


img

త్వరలో జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు తెరాస తరపున నలుగురు అభ్యర్ధుల పేర్లను ప్రకటించి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సిఎం కేసీఆర్‌ జలక్ ఇచ్చారు. ఎమ్మెల్యేల కోటాలో జరుగబోతున్న ఈ ఎన్నికలలో 5మంది అభ్యర్ధులకు అవకాశం ఉండగా తెరాస తరపున నలుగురు, మజ్లీస్ పార్టీ తరపున ఒకరు నిలబెట్టాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక అభ్యర్ధిని నిలబెట్టబోతోంది కనుక ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ అనివార్యం అయ్యింది. 

తెరాస తరపున హోమ్మంత్రి మహమూద్ అలీ, కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం కురుమ, ఎండీసీ ఛైర్మన్ శ్రేయి సుభాష్ రెడ్డి, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాధోడ్‌ల పేర్లను సిఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. ఐదవ సీటును తెరాసకు మిత్రపక్షంగా ఉన్న మజ్లీస్ పార్టీకి విడిచిపెట్టారు. 

వాస్తవానికి తెరాస నుంచి ఇద్దరు, కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీలు మార్చి నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీకి కేవలం 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నందున సొంత బలంతో కనీసం ఒక్కరిని కూడా గెలిపించుకొనే స్థితిలో లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఒక అభ్యర్ధిని బరిలో దింపితే అప్పుడు తొలి ప్రాధాన్యత ఓటుకు 21 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే సరిపోతుంది. కాంగ్రెస్‌ (19), టిడిపి (2) కలిపి 21 అవుతారు. కానీ ఎన్నికలలోగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ ఫిరాయించకుండా ఉండాలి. ఉంటే టిడిపి సహకారంతో ఒక్క ఎమ్మెల్సీని మాత్రం కాంగ్రెస్‌ గెలిపించుకోగలదు.

తెరాస, మజ్లీస్ పార్టీలు కలిసి 5మందిని నిలబెడితే ఒక్కొకరికీ 21 మంది ఎమ్మెల్యేల చొప్పున 105 మంది మద్దతు ఉండాలి. కానీ తెరాస-91, మజ్లీస్-7 మంది కలిపి 98 మంది మాత్రమే అవుతారు. కనుక ఆ మేరకు కాంగ్రెస్ మరియు టిడిపి ఎమ్మెల్యేలను ఆకర్షించవలసి ఉంటుంది. బహుశః ఆ ఆలోచనతోనే ఐదుగురిని బరిలో దింపినట్లు భావించవచ్చు.


Related Post