రాహుల్ తాపత్రయం దేనికో...

February 22, 2019


img

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఉదయం డిల్లీ నుంచి తిరుపతి చేరుకొని కాలినడకన తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. ఆయనతోపాటు ఏపీకి చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలు కాలినడకన శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. మధ్యాహ్నం 3గంటలకు రాహుల్ గాంధీ శ్రీవారిని దర్శించుకొంటారు. సాయంత్రం 4 గంటలకు తిరుపతి పట్టణంలోని జ్యోతిరావు పూలే సర్కిల్‌కు చేరుకొంటారు. అక్కడి నుంచి ‘ఏపీకి ప్రత్యేక హోదా భరోసా బస్సుయాత్ర’లో పాల్గొంటారు. అనంతరం స్థానిక తారకరామ స్టేడియంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొంటారు. 

గత ఎన్నికలలో అదే మైదానంలో నిర్వహించిన ఎన్నికల సభలో నరేంద్రమోడీ మాట్లాడుతూ ‘కేంద్రంలో మా పార్టీ అధికారంలోకి వస్తే తిరుమల వెంకటేశ్వరుని పాదాల సాక్షిగా ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తాము’ అని హామీ ఇచ్చారు. కానీ ఇవ్వలేదు. ఈసారి కాంగ్రెస్‌ పార్టీ కూడా అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తోంది. ‘తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏ‌పీకి ప్రత్యేకహోదా ఇస్తామని’ రాహుల్ గాంధీ కూడా హామీ ఇవ్వబోతున్నారు. సభ ముగిసిన తరువాత మళ్ళీ రేణిగుంట విమానాశ్రయం నుంచి డిల్లీకి తిరిగి వెళతారు. 

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో...వస్తే ఏ‌పీకి ప్రత్యేకహోదా ఇస్తుందో లేదో...తెలియదు కానీ లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాహుల్ గాంధీ హిందువులను ప్రసన్నం చేసుకొనేందుకు చాలా తిప్పలు పడుతున్నారు. 

కొన్ని రోజుల క్రితం ఓ ఆలయంలో పూజలు చేస్తూ తాను జంద్యం ధరించే బ్రాహ్మణుడినని, తన గోత్రనామాలు చెప్పుకొన్నారు. రెండు రోజుల క్రితం యూపీలో పుల్వామా బాధిత కుటుంబాలను పరామర్శించినప్పుడు వారి ఇళ్లలో రాహుల్ గాంధీ గాయత్రీ మంత్రం పటించారు. ఆ అసందర్భ చర్య గురించి కాంగ్రెస్‌ పార్టీ సోషల్ మీడియాలో గొప్పగా చాటింపు వేసుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు కాలినడకన తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఇటువంటి పనులతో దేశంలోని హిందువులు ప్రసన్నం అవుతారా? కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారా?


Related Post