భారత్‌తో యుద్ధానికి పాక్ సై!

February 22, 2019


img

పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన గురువారం ఇస్లామాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆ దేశ చీఫ్ ఆర్మీ ఆఫీసర్, ఇంటలిజెన్స్, భద్రతాధికారులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొని పుల్వామా ఉగ్రదాడి తదనంతర పరిణామాలపై చర్చించారు. పాక్‌పై ప్రతీకారం తీర్చుకొంటామని భారత ప్రధాని నరేంద్రమోడీతో సహా పలువురు కేంద్రమంత్రులు, రక్షణశాఖ అధికారులు చెపుతున్నందున, ఒకవేళ పాకిస్థాన్‌పై భారత్ దాడికి పాల్పడితే గట్టిగా ఎదురుదాడి చేయాలని పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆర్మీ చీఫ్ జావేద్ బజ్వాను ఆదేశించారు. ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న భారత్ ఏ సమయంలోనైనా దాడి చేసే అవకాశం ఉంది కనుక నిఘావర్గాలు మరింత అప్రమత్తంగా ఉండాల్ని ఆదేశించారు. పాకిస్థాన్‌ ప్రజలను కాపాడుకోవలసిన బాధ్యత తమపై ఉంది కనుక భారత్ ఎటువంటి దుస్సాహస్మ్ చేసినా గట్టిగా తిప్పి కొడతామని, ఆ శక్తిసామర్ధ్యాలు తమ దేశానికి ఉన్నాయని పాక్‌ జాతీయ భద్రతామండలి మీడియాకు తెలిపింది. పుల్వామా ఉగ్రదాడితో పాకిస్థాన్‌కు ఎటువంటి సంబందమూ లేదని స్పష్టం చేసింది.      

ఈసారి భారత్ తన వైఖరిని ముందే స్పష్టం చేసింది కనుక పాక్‌ ప్రభుత్వం కూడా భారత్‌ను ఎదుర్కొనేందుకు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం సహజమే. ఈసారి దాడి చేస్తే పాక్‌ అందుకు సిద్దంగా ఉంటుందనే సంగతి భారత ప్రభుత్వానికి కూడా తెలుసు. కనుక దాడికి గల అవకాశాలను, దాడి పర్యవసనాలను అన్నిటినీ పరిగణనలోకి తీసుకొనే తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. కనుక పాక్‌ ఇంత అప్రమత్తంగా ఉన్న ఈ సమయంలో ఆదేశంపై ఎటువంటి దాడికి భారత్ ప్రయత్నించకపోవచ్చు.


Related Post