హరీష్‌రావు ఏమి చేస్తారో?

February 21, 2019


img

హరీష్‌రావు పరిచయం అవసరంలేని వ్యక్తి. గత ప్రభుత్వంలో సాగునీటిశాఖా మంత్రిగా ఆయన పనితీరు, కార్యదీక్షను   అందరూ చూశారు. తొలివిడత మంత్రివర్గ విస్తరణలో కొందరు కొత్తవారికి కూడా అవకాశం లభ్హించింది కానీ ఆయనకు అవకాశం లభించలేదు. లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకు మళ్ళీ మంత్రివర్గ విస్తరణ ఉండబోదనే విషయం కూడా దాదాపు స్పష్టం అయ్యింది. హరీష్‌రావు ఇదంతా ముందుగానే తెలుసుకొన్నారో ఏమో మూడు వారాల క్రితమే బంజారాహిల్స్ లోని తన అధికార నివాసాన్ని ఖాళీ చేసి కొండాపూర్‌లోని తన సొంత ఇంటికి వెళ్ళిపోయారు. 

సిఎం కేసీఆర్‌ తనను పక్కన పెట్టడంపై మీడియాలో వస్తున్న ఊహాగానాలపై హరీష్‌రావు చాలా హుందాగా స్పందించడం అందరూ చూశారు. 

ఇదివరకు “బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అని అందరూ ఆలోచించినట్లే, ఇప్పుడు “హరీష్‌రావు వంటి నమ్మకస్థుడు, సమర్ధుడుని సిఎం కేసీఆర్‌ ఎందుకు పక్కన పెట్టారు?” అని ఆలోచిస్తున్నారు.

జాతీయరాజకీయాలలోకి కీలకపాత్ర పోషిస్తానని సిఎం కేసీఆర్‌ పదేపదే చెపుతున్నారు కనుక అన్ని అనుకొన్నట్లుగా జరిగితే తనతోపాటు హరీష్‌రావును కూడా లోక్‌సభకు పోటీ చేయించి డిల్లీకి తీసుకుపోవాలని భావిస్తునందునే హరీష్‌రావుకు మంత్రిపదవి ఇవ్వలేదనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే ఎలాగూ కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు కనుక అప్పుడు హరీష్‌రావును మంత్రివర్గంలో తీసుకోవచ్చు. ఒకవేళ హరీష్‌రావును లోక్‌సభకు పోటీ చేయించాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లయితే, ఆయనకు కేంద్రమంత్రి పదవి లభిస్తే మరింత రాణిస్తారు. దేశానికి ఎంతో ఉపయోగపడతారు. కానీ కేవలం ఎంపీగా మిగిలిపోతే ఆయన ప్రతిభ, సామర్ధ్యం, కార్యదక్షత అన్నీ వృధా అయిపోతాయని చెప్పక తప్పదు. హరీష్‌రావు వంటి సమర్ధుడిని సిఎం కేసీఆర్‌ వృధాగా పక్కన కూర్చోబెడతారనుకోలేము. హరీష్‌రావు భవిష్యత్ ఏమిటనేది తెలియాలంటే లోక్‌సభ ఎన్నికల గంట మ్రోగేవరకైనా ఓపిక పట్టకతప్పదు.


Related Post