తమిళనాడులో కాంగ్రెస్‌-9, బిజెపి-6కు సెటిల్

February 21, 2019


img

లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నందున కాంగ్రెస్‌, బిజెపిలు ఒక్కో రాష్ట్రంలో ప్రాంతీయపార్టీలతో ఎన్నికల పొత్తులు కుదుర్చుకొంటున్నాయి. రెండు రోజుల క్రితమే తమిళనాడులో అధికార అన్నాడిఎంకె పార్టీతో బిజెపి పొత్తులు కుదుర్చుకొని 5 లోక్‌సభ స్థానాలను ఖరారు చేసుకోగా, తాజాగా కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకె పార్టీతో పొత్తు కుదుర్చుకొని 9 సీట్లు ఖరారు చేసుకొంది. మిగిలిన 30 స్థానాలలో డిఎంకె పోటీ చేస్తుంది.  

లోక్‌సభ ఎన్నికలతో పాటే 21 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉపఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వాటి కోసం నోటిఫికేషన్‌ వెలువడిన తరువాత పొత్తులు, సీట్ల పంపకలపై నిర్ణయం తీసుకొంటామని డిఎంకె అధినేత స్టాలిన్ చెప్పారు. ఇక పుదుచ్చేరిలో గల ఒకే ఒక లోక్‌సభ సీటు కోసం కాంగ్రెస్‌, బిజెపిలు ముఖాముఖి తలపడనున్నాయి. 

ఉత్తరాది రాష్ట్రాలలో సత్తా చాటుకొంటున్న కాంగ్రెస్‌, బిజెపిలు కర్ణాటకలో తప్ప దక్షిణాది రాష్ట్రాలలో అడుగుపెట్టలేకపోతున్నాయి. తమిళనాడు జరిగే ప్రతీ ఎన్నికలలో ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, రాహుల్ గాంధీ వంటి హేమాహేమీలు ప్రచారంలో పాల్గొంటున్నప్పటికీ ఆ రెండు పార్టీలు గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకోలేకపోతున్నాయి. కనుక ఈసారి కాంగ్రెస్‌ పార్టీ డిఎంకెతో, బిజెపి అన్నాడిఎంకె పార్టీలతో ఎన్నికల పొత్తులు పెట్టుకొని కనీసం 5-6 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని తాపత్రయపడుతున్నాయి. అయితే బొత్తిగా ఆదరణ లేని తమిళనాడులో 5-6 సీట్ల కోసం తాపత్రయపడే బదులు కాస్త పట్టున్న రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్‌, బిజెపిలు గట్టిగా ప్రయత్నిస్తే ఏమైనా ఫలితం ఉంటుందేమో కదా? 


Related Post