ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయా?

February 21, 2019


img

ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికలకు నేడు నోటిఫికేషన్‌ వెలువడింది. మార్చి 15వ తేదీన పోలింగ్ జరుగుతుంది. తెరాసకు చెందిన ముగ్గురు, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు మార్చి 29న పదవీ విరమణ చేయబోతున్నారు. ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీల స్థానంలో మళ్ళీ ఇద్దరిని ఎన్నుకొనేందుకు కాంగ్రెస్ పార్టీకి తగినంతమంది ఎమ్మెల్యేలు లేరు కనుక ఒక్కరినీ మాత్రమే గెలిపించుకోగలదు. కానీ తెరాస 5 స్థానాలకు అభ్యర్ధులను నిలబెట్టినట్లయితే, ఆ ఒక్క అభ్యర్ధిని గెలిపించుకోవడం కాంగ్రెస్ పార్టీకి కష్టమే. ఒకవేళ తెరాస 5వ అభ్యర్ధిని బరిలో దించినట్లయితే ఆ అభ్యర్ధిని గెలిపించుకోవడానికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఫిరాయింపజేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తుంది. కనుక ఈ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడే ప్రమాదం కూడా పొంచి ఉంది.      

ప్రస్తుతం నామినేటడ్ ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 120 మంది శాసనసభ్యులున్నారు. వారిలో తెరాసకు 91, కాంగ్రెస్‌-19, మజ్లీస్-7, టిడిపి-2, బిజెపికి ఒక్క ఎమ్మెల్యేలున్నారు. కనుక ఒక్కో ఎమ్మెల్సీ ఎన్నికకు 120/5=24 మంది ఎమ్మెల్యేల ప్రాధాన్యత ఓట్లు అవసరం. 

తెరాస, మజ్లీస్ పార్టీలు కలిపి మొత్తం 98 మంది ఎమ్మెల్యేలున్నారు కనుక వారి మద్దతుతో నలుగురు ఎమ్మెల్సీలను అవి గెలిపించుకోగలవు. కానీ కాంగ్రెస్‌ ఒక అభ్యర్ధిని, తెరాస ఐదుగురు అభ్యర్ధులను నిలబెట్టినట్లయితే అప్పుడు రెండవ ప్రాధాన్యత ఓట్లు విలువ 120/6= 20 అవుతుంది. అప్పుడు తొలి ప్రాధాన్యతలో 21 ఓట్లు సాధించిన అభ్యర్ధి ఎమ్మెల్సీగా ఎన్నికవుతారు. 

కాంగ్రెస్‌, టిడిపిలకు కలిపి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక రెండు పార్టీలు చేతులు కలిపితే ఒక అభ్యర్ధిని గెలిపించుకోగలవు. కానీ తెరాస తన ఐదవ అభ్యర్ధిని గెలిపించుకోవడం కోసం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించినట్లయితే కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడటమే కాకుండా మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కనుక ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి మరో అగ్నిపరీక్షవంటివేనని భావించవచ్చు.


Related Post