నేరస్తులతో భేటీ దురదృష్టకరం: చంద్రబాబు

February 20, 2019


img

ప్రముఖ తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున మంగళవారం లోటస్ పాండ్ నివాసంలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కలవడంపై మీడియాలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా స్పందించారు. 

“సమాజంలో ఎంతో పేరు ప్రతిష్టలు, ఎంతో గౌరవం కలిగిన సినీ నటులు అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళివచ్చిన నేరస్తుడిని కలవడం దురదృష్టకరం. దాని వలన ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయి,” అని అన్నారు.

జగన్ కేసుల సంగతి పక్కన పెడితే సినీ, రాజకీయ ప్రముఖులు జగన్మోహన్ రెడ్డిని కలుస్తుంటే తప్పకుండా ఆ ప్రభావం ఏపీ ప్రజలపై ఉంటుందని చెప్పవచ్చు. త్వరలో జరుగబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని అందుకే అందరూ ఆయనింటికి క్యూ కడుతున్నారని ప్రజలు భావించే అవకాశం ఉంది. అలాగే జగన్‌ నిర్ధోషి కనుకనే నాగార్జున వంటివారు వెళ్ళి కలుస్తున్నారనే అభిప్రాయం ప్రజలకు కలగవచ్చు. ఇది టిడిపికి ఎన్నికలలో చాలా నష్టం కలిగించవచ్చు. అందుకే తప్పుడు సంకేతాలు వెళతాయని చంద్రబాబునాయుడు ఆందోళన చెందుతున్నట్లున్నారు. 

ప్రస్తుతం అధికారంలో ఉన్న టిడిపికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు వైకాపాలో చేరిపోతున్నారు. రాబోయే  ఎన్నికలలో వైకాపా గెలుస్తుందనే నమ్మకంతోనే కావచ్చు. కనుక నాగార్జున వంటివారి కంటే సొంత పార్టీ వారివలన ప్రజలకు వెళుతున్న తప్పుడు సంకేతాలను, తద్వారా టిడిపికి జరుగుతున్న నష్టాన్ని అత్యవసరంగా నివారించుకోవడం మంచిది. 


Related Post