తెరాస అధికారంలోకి వచ్చిన 66 రోజుల తరువాత నేడు 10 మంది మంత్రులతో మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, ఎస్.నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ వారి చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్‌రావు, ఎంపీలు హాజరయ్యారు. ప్రమాణస్వీకారం చేసిన తరువాత మంత్రులు అందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్ళి తెలుపుకొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత డిసెంబరు 13వ తేదీన కేసీఆర్ ముఖ్యమంత్రిగా, మహమూద్ఆలీ హోం మంత్రిగా ప్రమాణస్వీకారాలు చేశారు. వారితో కలిపి ఇప్పుడు మొత్తం 12 మంది మంత్రులు ఉన్నారు. కొత్త మంత్రులకు ఈరోజే మంత్రిత్వశాఖలను అప్పగించనున్నారు. మరికొద్ది సేపటిలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల తరువాత మరో ఆరుగురిని మంత్రివర్గంలో తీసుకోవాలని సిఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.