మోడీ భవిష్యత్ ఏవిధంగా ఉండబోతోందంటే....

February 13, 2019


img

త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌, బిజెపిలలో ఏదీ పూర్తి మెజార్టీ సాధించలేదని, ప్రాంతీయపార్టీలను ఎవరు ఆకర్షిస్తే వారే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని సర్వేలు సూచిస్తుండగా, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ అందుకు పూర్తిభిన్నంగా స్పందించారు. 

“లోక్‌సభ ఎన్నికలలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఎన్ని సీట్లు సాధిస్తుందో ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది కానీ నరేంద్రమోడీ మళ్ళీ ప్రధాని కావడం ఖాయం. ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటుకు తగినన్ని సీట్లు బిజెపికి రాకపోయినా, బిజెపి మోడీని పక్కన పెట్టే సాహసం చేయదనే భావిస్తున్నాను. మా పార్టీ అధినేత నితీశ్ కుమార్ యాదవ్ ఆయనకు పోటీ అని నేను అనుకోవడం లేదు,” అని అన్నారు. 

బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బిజెపి అంటే మోడీ...మోడీ అంటే బిజెపి అన్నట్లు తయారైంది. కనుక బిజెపి గెలుపోటములు ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్ట, ప్రజాధారణ బట్టే ఉంటాయి. మోడీ విధానాలపట్ల ప్రజలలో, కొంత వ్యతిరేకత నెలకొని ఉన్నప్పటికీ, ఈ ఐదేళ్ళలో మోడీ తీసుకొన్న సాహసోపేత నిర్ణయాలు, దేశవ్యాప్తంగా చేపట్టిన అనేక అభివృద్ధిపనుల పట్ల దేశప్రజలు సంతృప్తి చెందినట్లయితే అది బిజెపికి అనుకూలంగా మారగలదు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా దూకుడుగా వ్యవహరిస్తూ, పార్టీని విజయపధంలో నడిపిస్తున్నప్పటికీ, ఆయన ప్రధాని నరేంద్రమోడీకి సమఉజ్జీ కాదనే అభిప్రాయం ఇంకా వినబడుతూనే ఉంది. ఇది కూడా మోడీ (బిజెపి)కి కలిసి వచ్చే అంశమే. ఒకవేళ రాహుల్ గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేయడానికి సిద్దపడితే కాంగ్రెస్‌ మిత్రపక్షాలు కేంద్రంలో అధికారంలోకి రావడానికి అవకాశాలు మెరుగుపడతాయి. కాదంటే మోడీ వంటి బలమైన నాయకత్వం కలిగిన బిజెపియే మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావచ్చు.


Related Post