కెసిఆర్ మమతకు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? బాబు ప్రశ్న

February 07, 2019


img

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిలపై ఏపీ సిఎం చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. బుదవారం టిడిపి నేతలతో మాట్లాడుతూ, “పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ తో సహా దేశంలో చాలామంది ప్రతిపక్షనేతలు ఆమెకు సంఘీభావం తెలిపారు. ఫెడరల్‌ ఫ్రంట్‌కు మద్దతు కూడగట్టడానికి కేసీఆర్‌ రెండుసార్లు కోల్‌కతా వెళ్ళి మమతా బెనర్జీని కలిశారు. కానీ కేసీఆర్‌ ఆమెకు సంఘీభావం తెలుపలేదు. అలాగే రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించలేదు ఆమెకు సంఘీభావం తెలుపలేదు. ఎందుకంటే, వారిద్దరూ మోడీ కనుసన్నలలో పనిచేస్తున్నారు. మోడీ కోసమే ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదనను కేసీఆర్‌ తెరపైకి తెచ్చారు. అక్కడ పెద్ద మోడీ, ఇక్కడ ఇద్దరు చిన్న మోడీలు కలిసి ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో దేశాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తున్నారు,” అని చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. 

మమతా బెనర్జీ మద్దతు కోరినప్పుడు కేసీఆర్‌ లేదా ఎవరైనా ఆమెకు సంఘీభావం ప్రకటించడం సహజమే. కానీ శారదా, రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణాలలో ఆమె ప్రభుత్వం తీవ్ర నేరారోపణలతో సిబిఐ విచారణను ఎదుర్కొంటున్నప్పుడు గుడ్డిగా ఆమెకు సంఘీభావం తెలుపడం రాజనీతిజ్ఞుల లక్షణం కాదు. బహుశః అందుకే కేసీఆర్‌ మౌనం వహించి ఉండవచ్చు. ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ కూడా స్పందించినప్పటికీ మమతా బెనర్జీకు సంఘీభావం ప్రకటించలేదు పైగా సిబిఐ వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిదంటూ మమతా బెనర్జీని సున్నితంగా హెచ్చరించారు. 

రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారం చేజిక్కించుకొనేందుకు మమతా బెనర్జీ సహకరిస్తుందనే ఆశతోనే కాంగ్రెస్‌ మిత్రపక్షాల నేతలు ఆమెకు సంఘీభావం ప్రకటించారు. ఒకవేళ ఆమె అందుకు నిరాకరిస్తే ఎవరూ ఆమెకు అండగా నిలబడేవారు కాదు. కనుక మమతా బెనర్జీ కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపి రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేందుకు మద్దతు ఇస్తారా లేదా అనే విషయంపై ఆమె స్పష్టత ఇచ్చినప్పుడు ఏ పార్టీలు ఏ గట్టున ఉంటాయో తేలిపోతుంది. 


Related Post