కాంగ్రెస్‌పై ముఫ్తీ...బిజెడిపై రాహుల్ విమర్శలు...సేమ్ టు సేమ్

February 06, 2019


img

మన దేశంలో రాజకీయపార్టీలవి భార్యాభర్తల బంధాలవంటివి. అన్యోన్యంగా కాపురం సాగుతునంతకాలం అంతా బాగానే ఉంటుంది కానీ చెడితే ఒకరిలో మరొకరికి అన్ని తప్పులే కనిపిస్తుంటాయి. అంతవరకు ఒకరినొకరు పొగుడుకొన్న నోటితోనే తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకొంటుంటాయి.

ఉదాహరణకు జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో బిజెపి, పిడిపిల సంకీర్ణ ప్రభుత్వం నడిచినన్నాళ్ళు అప్పటి ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ సయీద్ ప్రధాని నరేంద్రమోడీని పొగుడుతుండేవారు. కానీ ఆమె ప్రభుత్వానికి బిజెపి మద్దతు ఉపసంహరించడంతో ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి ఆమె నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. 

“కాంగ్రెస్‌, బిజెపిలు దొందూ దొందే. అవి పైకి భిన్నసిద్దాంతాలతో పనిచేస్తున్న పార్టీలుగా కనిపిస్తున్నప్పటికీ రెండూ కూడా హిందుత్వ అజెండాతోనే పనిచేస్తున్నాయి. కనుక వాటిని వేరు చేసి చూడలేము,” అని ముఫ్తీ ట్వీట్ చేశారు. 

త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలుపుతారని కాంగ్రెస్‌ నేతలు చాలా ఆశపడ్డారు. ఒకవేళ చేతులు కలిపి ఉండి ఉంటే నేడు కాంగ్రెస్‌ నేతలు నవీన్ పట్నాయక్ ను పొగుడుతూ ఉండేవారు. కానీ ఆయన కాంగ్రెస్‌, బిజెపిలను సమానదూరంలో ఉంచాలని నిర్ణయించడంతో బిజెడి ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్రవిమర్శలు చేశారు. 

“కేంద్రంలోని బిజెపి, ఒడిశాలోని బిజెడి ప్రభుత్వం దొందూ దొందే. రెండు పార్టీలు పేదలను, రైతులను గాలికొదిలి కోటీశ్వరులైన కార్పొరేట్ కంపెనీల యాజమానులకు లబ్ది కలిగించడానికే ఎక్కువ మొగ్గు చూపుతాయి. రైతుల రుణాలు మాఫీ చేయడానికి వారివద్ద డబ్బు ఉండదు కానీ కార్పొరేట్ కంపెనీలు వేలకోట్లు ఎగవేస్తుంటే గుట్టు చప్పుడు కాకుండా  వాటిని మాఫీ చేసేస్తుంటాయి. రెండు పార్టీలు దళితులు, గిరిజనులు, రైతులను నిలువునా దోచుకొంటున్నాయి. వారి తరపున కాంగ్రెస్ పార్టీ నిలిచి బిజెపి, బిజెడిలతో పోరాడేందుకు సిద్ధంగా ఉంది. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశంలో అణగారిన వర్గాల ప్రజల తరపున నిలుస్తుంది,” అని రాహుల్ గాంధీ అన్నారు. ముఫ్తీ, రాహుల్ గాంధీల అభిప్రాయాలు విన్నప్పుడు అందితే జుట్టు లేకుంటే కాళ్ళు అన్నట్లుంది మన రాజకీయ పార్టీల తీరు.


Related Post