ప్రియాంక రాకతో కాంగ్రెస్‌ పరిస్థితి మెరుగుపడుతుందా?

February 06, 2019


img

కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంకా వాద్రాను కాంగ్రెస్‌ ప్రధానకార్యదర్శిగా నియమించి తూర్పు ఉత్తరప్రదేశ్ పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఈరోజు ఆమె డిల్లీలోని అక్బర్ రోడ్డులో గల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి పార్టీ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ గదికి పక్కనే ఉన్న గదిలో ఆమెకు కార్యాలయం ఏర్పాటు చేశారు. ప్రియాంకా వాద్రా గురువారం ఉదయం అధికారికంగా పార్టీ నేతలతో తొలి సమావేశం నిర్వహించి లోక్‌సభ ఎన్నికల వ్యవహారాల గురించి చర్చిస్తారు. త్వరలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టే అవకాశం ఉంది.

ప్రియాంకా వాద్రాకు తన నాన్నమ్మ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ పోలికలు కలిగి ఉండటం ఆమెకు, కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చు అంశమే. కానీ కేవలం పోలికలే సరిపోవు. వాటితో పాటు స్వర్గీయ ఇందిరా గాంధీకున్న నాయకత్వ లక్షణాలు, రాజకీయ చతురత ఉన్నప్పుడే రాజకీయాలలో రాణించగలరు. ఆమెకు అటువంటి గొప్ప లక్షణాలు ఉన్నాయో లేవో త్వరలోనే తెలుస్తుంది. 

ఒకవేళ లోక్‌సభ ఎన్నికలలో ఆమె తన శక్తిసామర్ధ్య్లాలను నిరూపించుకోగలిగితే ఆమెకు రాజకీయాలలో ఇక తిరుగు ఉండదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ నిలద్రొక్కుకొని కేంద్రంలో అధికారంలోకి రాగలదు. కానీ లోక్‌సభ ఎన్నికలలో ఆమె తన సత్తా చాటుకోలేకపోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లవుతుంది.

ఆమెను ట్రంప్ కార్డుగా ఉపయోగించాలనుకోవడం మంచి నిర్ణయమే కానీ ఆమె తన సత్తాను చాటుకోవడానికి రెండు నెలల సమయం చాలా తక్కువేనని చెప్పవచ్చు. కనీసం రెండు మూడేళ్ళ క్రితమే ఆమెకు పార్టీ బాధ్యతలు అప్పగించి ప్రత్యక్ష రాజకీయాలలోకి రప్పించి ఉండి ఉంటే ఆమె కూడా లోక్‌సభ ఎన్నికల సమయానికి బాగా రాణించి ఉండేవారు. ఆమె శక్తిసామర్ధ్యాల గురించి ప్రజలకు కూడా అవగాహన ఏర్పడి ఉండేది. ఏమయినప్పటికీ, ప్రియాంకా వాద్రా రాకతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహామ్ కనిపిస్తోంది.


Related Post