రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు రాహుల్ క్లాస్!

February 06, 2019


img

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం ఉదయం రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దలు, ఎమ్మెల్యేలతో డిల్లీలో సమావేశమైనప్పుడు, అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినందుకు అందరికీ క్లాస్ పీకారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అభ్యర్ధుల ఎంపిక, పొత్తులు, ఎన్నికల వ్యూహాల అమలువరకు ప్రతీవిషయంలోను పూర్తి స్వేచ్ఛనిచ్చి ఎంతో ప్రోత్సహించినప్పటికీ ఎందుకు ఓడిపోయామని రాహుల్ గాంధీ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలను సూటిగా ప్రశ్నించారు. 

తెరాస అధికార దుర్వినియోగం, ధనప్రవాహం, ఈవీఎంల ట్యాంపరింగ్, పోలింగులో అవకతవకలు, చంద్రబాబునాయుడు ప్రచారం, ఆయనను బూచిగా చూపించే తెరాస ఎన్నికల వ్యూహాలు వంటి అనేక కారణాల వలన ఓడిపోయామని వారు రాహుల్ గాంధీకి చెప్పబోతే వారి సంజాయిషీని ఆయన తిరస్కరించారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ అంతకంటే ఎక్కువే వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొని పోరాడి విజయం సాధించినప్పుడు, అంతా సానుకూలంగా ఉందనుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు విజయం సాధించలేకపోయిందని రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఓటమికి తనదే బాధ్యత అని అందుకు క్షమించవలసిందిగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీని కోరారు. 

తెరాస ఎన్నికల వ్యూహాలు ఎంత పటిష్టంగా ఉంటాయో గత ఎన్నికల నుంచి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు చూస్తూనే ఉన్నారు. కానీ తెరాసను చాలా తేలికగా తీసుకుని చివరి నిమిషం వరకు అభ్యర్ధులను ఖరారు చేయకుండా తాత్సారం చేశారని టిజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అప్పుడే చెప్పారు. అలాగే టిడిపితో పొత్తు పెట్టుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకోగానే, చంద్రబాబునాయుడును బూచిగా చూపిస్తూ తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఎన్నికల వ్యూహం అమలుచేయడం మొదలుపెట్టారు. దానివలన కాంగ్రెస్‌ పార్టీకి తీరని నష్టం జరుగుతుందని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు అప్పుడే అర్ధం చేసుకొని తదనుగుణంగా తమ ప్రతివ్యూహాలను రూపొందించుకొని ఉండాలి. కానీ ఆ విషయంలో కూడా తెరాసను చాలా లైట్ తీసుకొని గుడ్డిగా ముందుకు వెళ్ళి ఊహించినట్లుగానే బోర్లా పడ్డారు. 

ఎన్నికలలో ఓటమి తరువాత రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు తెరాస అధికార దుర్వినియోగాన్ని, ఈవీఎంలను, ఎన్నికల సంఘాన్ని నిందిస్తూ తమను తాము సమర్ధించుకునే ప్రయత్నం చేశారు తప్ప ఆత్మవిమర్శ చేసుకొని తమ ఓటమికి గల కారణాలను తెలుసుకొని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నాలు చేయనేలేదు. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వంపై పార్టీలో వి.హనుమంతరావు వంటి సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కనుక ఇటువంటి సమస్యలను,  లోపాలను గుర్తించి సరిదిద్దుకోకుండానే మళ్ళీ యధాతధంగా లోక్‌సభ ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. 

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటే రాష్ట్రంలో కూడా వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవలసి ఉంటుంది. కానీ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు లోక్‌సభ ఎన్నికలకు కూడా ఎటువంటి ముందస్తు కసరత్తు చేయకుండానే ఎవరికివారు టికెట్లు సంపాదించుకోవడంపైనే దృష్టి పెట్టారు. కనుక ఇప్పటికైనా కాంగ్రెస్‌ నేతలు మేల్కొని జాగ్రత్తపడకపోతే లోక్‌సభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ భంగపాటు తప్పకపోవచ్చు. 



Related Post