మమతకు సుప్రీం షాక్... షాకిచ్చినందుకు ధన్యవాదాలు!

February 05, 2019


img

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. శారదా, రోజ్ వ్యాలీ చిట్ ఫండ్స్ కుంభకోణంలో కోల్‌కతా పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్‌ను సిబిఐ విచారించవచ్చునని స్పష్టం చేసింది. సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, సిబిఐ అధికారులు ఎవరినైనా విచారణకు పిలువవచ్చునని, పిలిచినప్పుడు ఎవరైనా తప్పనిసరిగా హాజరుకావలసిందేనని స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో రాజీవ్ కుమార్ ఒక బాధ్యతాయుతమైన హోదాలో ఉన్నందున విచారణకు ముందే అరెస్ట్ చేయాలనుకోవడం సరికాదని స్పష్టం చేసింది.    

కోల్‌కతా, న్యూడిల్లీ నగరాలలో కాకుండా వేరే ఎక్కడైనా తటస్థ వేదికపై ఆయనను విచారించాలని సిబిఐని ఆదేశించింది. ఈ కేసుకు సంబందించి పూర్తి వివరాలను సీల్డ్ కవరులో తమకు సమర్పించాలని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు అనుమతి లభించడంతో సిబిఐ రాజీవ్ కుమార్‌తో పాటు, పశ్చిమబెంగాల్ ముఖ్య కార్యదర్శికి, డిజిపిలకు కూడా ఈనెల 18లోగా తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ సిబిఐ నోటీసులు పంపింది.   

సుప్రీంకోర్టు తీర్పుపై మమతా బెనర్జీ స్పందిస్తూ, “దేశంలోని ఫెడరల్ వ్యవస్థలో ప్రతీ రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలు, వాటికి రాజ్యాంగ వ్యవస్థలు ఉంటాయని వాటిని గౌరవించవలసిందేనని సుప్రీంకోర్టు తీర్పుతో స్పష్టం అయ్యింది. కేంద్రప్రభుత్వం అధికారం చేతిలో ఉందికదా అని ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేస్తామంటే కుదరదని సుప్రీంకోర్టు తీర్పుతో స్పష్టం అయ్యింది. న్యాయాన్ని, చట్టాన్ని రక్షించినందుకు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. సుప్రీంకోర్టు తీర్పు యావత్ దేశప్రజల నైతిక విజయం,” అని అన్నారు. 

కానీ శారదా రోజి వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణాలపై సిబిఐ విచారణ ముందుకు సాగినట్లయితే మొట్టమొదట తృణమూల్ కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధుల పేర్లే పైకి వచ్చే అవకాశం ఉంది. అందుకే మమతా బెనర్జీ సిబిఐ విచారణను అడ్డుకునేందుకు ప్రయత్నించారనేది బహిరంగ రహస్యం. 

అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందే వారి పేర్లను బయటపెట్టి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయాలనే ఉద్దేశ్యంతోనే కేంద్రం సిబిఐ విచారణను వేగవంతం చేసిందనేది కూడా బహిరంగ రహస్యమే. కనుక సుప్రీంకోర్టు తాజా తీర్పు వలన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఎంతో కొంత నష్టం కలిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఆ విషయం మమతా బెనర్జీ కూడా గ్రహించినప్పటికీ, పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ సుప్రీం తీర్పు తమ నైతికవిజయమని చెప్పుకొంటున్నారు.


Related Post