కేసీఆర్‌కు హనుమంతరావు సూటి ప్రశ్న

February 05, 2019


img

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మోడీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కోల్‌కతాలో దీక్ష చేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంతవరకు ఎందుకు స్పందించలేదని సీనియర్ కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. సిబిఐ అధికారులు ఎటువంటి వారెంట్ లేకుండా ఐపిఎస్ అధికారి అయిన కోల్‌కతా పోలీస్ కమీషనర్ రాజీవ్‌కుమార్‌ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే మమతా బెనర్జీ  వారిని ఆదిశక్తిలా అడ్డుకొన్నారు. అందుకు ఆమెను అభినందిస్తున్నానని వి.హనుమంతరావు అన్నారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కుల హరించడానికి ప్రయత్నిస్తే ఆమె ధైర్యంగా పోరాడుతున్నారని అన్నారు. సిఎం కేసీఆర్‌ ఆమెకు మద్దతు ప్రకటించలేదు....కనీసం ఈ అంశంపై ఇంతవరకు స్పందించలేదు. కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ బిజెపికి, మోడీ ప్రభుత్వానికి బీ-టీం గనుకనే కేసీఆర్‌ స్పందించలేదని వి.హనుమంతరావు అన్నారు.

శారదా చిట్ ఫండ్స్ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధుల హస్తం ఉందని, దానిపై విచారణ చేస్తున్న తమకు కోల్‌కతా పోలీస్ కమీషనర్ రాజీవ్‌కుమార్‌ సహకరించడంలేదని ఆరోపిస్తూ ఆదివారం రాత్రి సిబిఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేయాలని ప్రయత్నించారు. కానీ వారిని కోల్‌కతా పోలీసులు అడ్డుకున్నారు. ఆరోజు నుంచి కేంద్రవైఖరిని నిరసిస్తూ మమతా బెనర్జీ నుంచి కోల్‌కతాలో దీక్ష చేపట్టారు. ఆమెకు దేశంలో వివిద పార్టీలు సంఘీభావం తెలుపుతున్నాయి. కానీ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు ఆమె మద్దతు కోరుతున్న కేసీఆర్‌ మాత్రం ఆమెకు సంఘీభావం ప్రకటించకపోవడమే వి.హనుమంతరావు అనుమానానికి కారణం. ఇటీవల ఆమె నేతృత్వంలో కోల్‌కతాలో జరిగిన యునైటెడ్ ఇండియా బ్రిగేడ్ ర్యాలీకి తెరాస హాజరుకాలేదు. చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీతో వేదిక పంచుకోవడం ఇష్టం లేకనే హాజరు కాలేదని తెరాస సర్దిచెప్పుకొంది. కానీ ఇప్పుడు ఎందుకు స్పందించడంలేదని హనుమంతరావు ప్రశ్నిస్తున్నారు. మోడీ సూచన మేరకే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటవుతోందని కాంగ్రెస్‌ నేతలు అనుమానిస్తున్నారు.


Related Post