ధర్నా చేస్తూనే పాలన సాగిస్తా: మమత

February 04, 2019


img

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో వరుసగా రెండవరోజు కూడా ధర్నా కొనసాగిస్తున్నారు. రాజ్యాంగ పరిరక్షణ పేరుతో ఆమె ఆదివారం రాత్రి నుంచి కోల్‌కతాలో దీక్ష మొదలుపెట్టారు. కేంద్రప్రభుత్వం సిబిఐ, ఈడీ, ఐ‌టి కేంద్ర సంస్థలను రాష్ట్ర ప్రభుత్వాలపైకి ఉసిగొల్పుతూ వేధింపులకు పాల్పడుతూ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ మమతా బెనర్జీ దీక్ష మొదలుపెట్టారు. కేంద్రప్రభుత్వ   వైఖరి మారేంతవరకు పోరాడుతూనే ఉంటానని, అవసరమైతే దీక్షా వేదిక వద్ద నుంచే రాష్ట్రాన్ని పరిపాలిస్తానని అన్నారు. ఆమెది వితండ వైఖరని బిజెపి నేతలు ఆరోపిస్తుండగా, ఆమెకు కాంగ్రెస్‌ ఆదివారం రాహుల్ గాంధీ, ఏపీ సిఎం చంద్రబాబునాయుడు, ఇంకా మరికొంతమంది ప్రతిపక్ష నాయకులు సంఘీభావం ప్రకటించారు. 

శారదా చిట్ ఫండ్స్ కుంభకోణంలో కోల్‌కతా పోలీస్ కమీషనర్  రాజీవ్‌కుమార్‌ను ప్రశ్నించేందుకు సిబిఐ అధికారులు ఆదివారం సాయంత్రం వెళ్లినప్పుడు, కోల్‌కతా పోలీసులు వారిని నిర్బందించడంతో ఈ సమస్య మొదలైంది. రాజీవ్‌కుమార్‌ తమ విచారణకు సహకరించడంలేదని కనుక ఆయనను తమకు అప్పగించవలసిందిగా కోరుతూ సిబిఐ అధికారులు సోమవారం సుప్రీంకోర్టులో పిటిషను వేశారు. దానిపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. 

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆమె దీక్షకు కూర్చోంటే, తృణమూల్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాష్ట్రంలో చాలా హడావుడి చేయడం సహజం. తద్వారా లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలో బిజెపికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది కనుక బిజెపిని కట్టడి చేయడం కోసమే ఆమె దీక్షకు కూర్చొని ఉండవచ్చు. 


Related Post