కేసీఆర్‌కు దత్తన్న సూటి ప్రశ్న

February 02, 2019


img

కేంద్రబడ్జెట్‌పై తెరాస నేతలు చేస్తున్న విమర్శలపై బిజెపి ఎంపీ బండారు దత్తాత్రేయ ఘాటుగా స్పందించారు. శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “బడ్జెట్‌పై తెరాస నేతలు చేస్తున్న విమర్శలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. మతపరమైన రిజర్వేషన్లు కావాలని పట్టుపడుతున్న సిఎం కేసీఆర్‌, పార్లమెంటు ఆమోదించిన ఈబీసి రిజర్వేషన్లను అమలుచేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పధకం క్రింద నిరుపేదలకు కేంద్రప్రభుత్వం రూ.5లక్షల జీవితభీమా కల్పిస్తుంటే, దానిని రాష్ట్రంలో ఎందుకు అమలుచేయడం లేదు? దేశంలో నిరుపేదల సంక్షేమం కోసం ప్రధాని మోడీ చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొంటుంటే, తెలంగాణ రాష్ట్రంలో వాటిని అమలుచేయకుండా పేదప్రజలకు కేసీఆర్‌ ఎందుకు అన్యాయం చేస్తున్నారు? తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పధకాన్ని కేంద్రప్రభుత్వం కాపీ కొట్టిందనే తెరాస నేతల ఆరోపణలు అర్ధరహితం. దానికీ రైతుబంధు పధకానికి ఎక్కడా పోలికే లేదు. అయినా దేశవ్యాప్తంగా రైతులందరికీ కేంద్రప్రభుత్వం మేలు చేయాలని చూస్తే దానిపై తెరాస నేతలకు ఎందుకు అభ్యంతరం?” అని ప్రశ్నించారు. 

రిజర్వేషన్ల విషయంలో దత్తన్న వాదనలో బలం ఉందని చెప్పక తప్పదు. రిజర్వేషన్ల కోటాను పెంచే హక్కు, అధికారం రాష్ట్రాలకు ఉండవని తెరాస ప్రభుత్వానికి తెలిసి ఉన్నప్పటికీ మైనార్టీలకు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి శాసనసభలో తీర్మానం చేసి డిల్లీ పంపించి చేతులు దులుపుకొంది. ఆ తరువాత ఊహించినట్లే ఆ అంశాన్ని అసెంబ్లీ ఎన్నికలలో ఆయుధంగా ఉపయోగించుకొని లబ్దిపొందింది. మతపరమైన రిజర్వేషన్లు కావాలని పట్టుపడుతున్న కేసీఆర్‌, అడగకుండానే లభిస్తున్న 10 శాతం రిజర్వేషన్లు అమలుచేయడానికి ఎందుకు సంకోచిస్తున్నారు? కేంద్రప్రభుత్వం ప్రకటించిన అనేక పధకాలను రాష్ట్ర ప్రభుత్వం సొంత పధకాలుగా అమలుచేస్తున్నప్పుడు, ఆయుష్మాన్ భారత్ పధకాన్ని కూడా తెరాస ప్రభుత్వానికి అన్వయించుకొని రాష్ట్రంలో అమలుచేసి ఉండి ఉంటే లక్షలాది మంది పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు కలిగి ఉండేది కదా? ఈ పధకాన్ని అమలుచేయడానికి తెరాస ప్రభుత్వానికి అభ్యంతరం ఏమిటి? అనేదే దత్తన్న ప్రశ్న. 


Related Post