ఫిబ్రవరి 20లోగా కాంగ్రెస్‌ అభ్యర్ధుల జాబితా సిద్దం?

February 02, 2019


img

లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నందున కాంగ్రెస్ పార్టీ కూడా సిద్దం అవుతోంది. ఈనెల 20వ తేదీలోగా పోటీ చేయాలనుకొంటున్న అభ్యర్ధుల వివరాలు, వారిలో పోటీచేసి గెలవగలవారి పేర్లను పంపించవలసిందిగా కాంగ్రెస్‌ అధిష్టానం పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆదేశించింది. ఈసారి పిసిసి కమీటీ రూపొందించిన జాబితాను ప్రత్యేక కమిటీకి అందజేస్తారు. ఆ కమిటీ తుది జాబితాను ఖరారు చేస్తుంది. ఆ జాబితాను ఏఐసిసి కేంద్ర ఎన్నికల కమిటీ పరిశీలించి అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తుంది.    

అసెంబ్లీ ఎన్నికలలో ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీపై పార్టీలో నేతలే అనేక ఆరోపణలు చేయడంతో రాహుల్ గాంధీ ఈసారి దానికి బదులు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. అయితే దానిలో కూడా స్క్రీనింగ్ కమిటీలో ఉన్నవారే ఉండటం విశేషం. దానిలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ కుంతియా, రాష్ట్ర వ్యవహారాలను చూస్తున్న ముగ్గురు ఏఐసిసి కార్యదర్శులు, సిఎల్పి నేత మల్లు భట్టివిక్రమార్క సభ్యులుగా ఉంటారు. వారు అభ్యర్ధుల తుది జాబితాను ఖరారు చేసి డిల్లీకి పంపిస్తారు. డిల్లీలో కాంగ్రెస్‌ అధిష్టానం దానికి ఆమోదముద్ర వేస్తుంది.

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వేర్వేరుగా జరుగడం కాంగ్రెస్‌ నేతలకు బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినవారిలో రేవంత్‌ రెడ్డి, డికె అరుణ, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సర్వే సత్యనారాయణ  వంటి సీనియర్ నేతలు లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి మరోసారి తమ అదృష్టం పరీక్షించుకోవాలనుకొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ప్రతీ రాష్ట్రంలోనూ వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవలసిన అవసరం చాలా ఉంది కనుక పోటీకి సిద్దమవుతున్న సీనియర్ నేతలకు సంతోషంగా టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది.


Related Post