అది అపరిపక్వతా... అతితెలివా?

February 01, 2019


img

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాటలు, వ్యూహాలు ఒక్కోసారి చాలా విచిత్రంగా ఉంటాయి. అవి ఆయన దుందుడుకుతనానికి, రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమనుకోవాలో లేక అతితెలివి, అత్యాశలకు నిదర్శనమనుకోవాలో తెలియదు. ఈరోజు హైదరాబాద్‌లోని తన లోటస్ పాండ్ నివాసంలో కొందరు మేధావులతో సమావేశమైనప్పుడు వారితో జగన్ అన్న మాటలు విన్నప్పుడు అటువంటి సందేహమే కలుగుతుంది. 

“ఈసారి లోక్‌సభ ఎన్నికలలో ఏపార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజారిటీ రాదని, కనుక కేంద్రంలో హంగ్  ఏర్పడుతుందని సర్వేలు సూచిస్తున్నాయి. దేవుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేయడం కోసమే కేంద్రంలో హంగ్ పరిస్థితులను సృష్టిస్తున్నాడు. కనుక లోక్‌సభ ఎన్నికలలో వైసీపీకి 25కు 25 సీట్లు ప్రజలు ఇచ్చినట్లయితే, ఈ అవకాశాన్ని వినియోగించుకొని, రైల్వే జోన్, ప్రత్యేకహోదాతో సహా ఏ‌పీకి రావలసినవన్నీ సాధించుకోగలుగుతాము. ఈసారి ఏ పార్టీతోనూ ముందుగా పొత్తులు పెట్టుకోము. ఎన్నికల తరువాత మన రాష్ట్రానికి ఇచ్చిన హామీలను ఎవరు నెరవేరుస్తానంటే వారికే మద్దతు ఇద్దాము. మన మద్దతు కావాలంటే ముందు ఏపీకి ఇచ్చిన హామీలన్నిటినీ అమలుచేయాలని పట్టుపట్టే అవకాశం మనకు కలిగింది. కనుక కేంద్రంలో హంగ్  ఏర్పడితే మనకే మంచిది,” అని జగన్ మాటల సారాంశం. 

ఏపీకి న్యాయం జరగాలని కోరుకోవడం మంచిదే కానీ అందుకోసం కేంద్రంలో హంగ్ ఏర్పడి అస్థిర ప్రభుత్వం ఏర్పడాలని కోరుకోవడమే విడ్డూరంగా ఉంది. కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ అధికారదాహంతో అలమటించిపోతున్న పార్టీలన్నీ కలిసి కేంద్రంలో అధికారం చేజిక్కించుకున్నట్లయితే, దేశభవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుంది. ఇంతవరకు జరిగిన పురోభివృద్ధి నిలిచిపోయి దేశం మళ్ళీ 25 ఏళ్ళు వెనక్కు వెళ్ళిపోతుంది. కనుక దేశప్రయోజనాలను కోరుకొనేవారెవరైనా కేంద్రంలో పూర్తి మెజారిటీతో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుకావాలని కోరుకోవాలి. కానీ జగన్ హంగ్ ఏర్పడాలని కోరుకొంటున్నారు. పైగా ఏపీలో టిడిపి బలంగా ఉన్నప్పుడు 25 ఎంపీ సీట్లు తన పార్టీకే వచ్చేస్తాయని జగన్ కలలు కంటుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. కనుక జగన్ ఆలోచనలు రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమనుకోవాలా లేక అత్యాశనుకోవాలా? 


Related Post