హరీష్ రావు రాజీనామా!

January 31, 2019


img

టిఎస్ఆర్టీసీలో గుర్తింపు సంఘమైన టిఎంయుకు గౌరవాధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి, తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సంఘం ప్రధానకార్యదర్శికి పంపించారు. టిఎంయుకు తగినంత సమయం కేటాయించలేకపోతునందుకు రాజీనామా చేసినట్లు ఆయన సన్నిహితులు చెప్పినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో హరీష్ రావు సాగునీటిశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో నిర్మితమవుతున్న సాగునీటి ప్రాజెక్టు పనుల పర్యవేక్షణతో క్షణం తీరికలేకుండా ఉన్నమాట వాస్తవం. అప్పుడు టిఎంయుకు గౌరవాధ్యక్షుడుగా కొనసాగారు. కానీ ఇప్పుడు మంత్రిపదవిలేనప్పుడు అంతా ఒత్తిడి ఉండదు. కనుక ఇప్పుడు ఆయన ఇంత హటాత్తుగా తన పదవికి రాజీనామా చేయడం ఆలోచింపజేస్తోంది.

గత ఏడాది ఆర్టీసీ కార్మిక సంఘాలు తమకు కూడా ప్రభుత్వోద్యోగులతో సమానంగా ఫిట్మెంట్ ఇవ్వాలని, జీతభత్యాలు పెంచాలని కోరుతూ సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు సిఎం కేసీఆర్‌ వారితో చాలా కటువుగా వ్యవహరించారు. సమ్మె చేస్తే ఆర్టీసీని మూసివేయవలసి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. ఆ సమయంలో టిఎంయుకు గౌరవాధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న హరీష్ రావు అటు సిఎం కేసీఆర్‌ను ఒప్పించలేక కార్మికులకు నచ్చజెప్పలేక చాలా ఇబ్బందిపడి ఉంటారని వేరే చెప్పనవసరంలేదు. నిజానికి ఆయన అప్పుడే టిఎంయు నుంచి తప్పుకొంటారని ఊహాగానాలు వినిపించినప్పటికీ, ఆవిధంగా చేస్తే సిఎం కేసీఆర్‌తో విభేదించినట్లవుతుంది కనుక ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగారు. బహుశః ఆనాడు ఎదురైన ఇబ్బందికర పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే హరీష్ రావు ఈరోజు తన పదవికి రాజీనామా చేసి ఉండవచ్చు.


Related Post