టీఆర్ఎస్‌ మాతో మైండ్ గేమ్ ఆడుతోంది: భట్టి

January 31, 2019


img

తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “టీఆర్ఎస్‌కు పూర్తి మెజారిటీ లభించినప్పటికీ ఇంకా మా ఎమ్మెల్యేలను ఫిరాయింపజేసుకోవాలనే ఆలోచనతో మాతో మైండ్ గేమ్స్ ఆడుతోంది. టీఆర్ఎస్‌లో చేరేందుకు అంగీకరించకపోతే బెదిరింపులకు పాల్పడుతోంది. ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యవ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తోంది. అయితే టీఆర్ఎస్‌ ప్రలోభాలకు, బెదిరింపులకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎవరూ లొంగరు ఆ పార్టీలో చేరారని గ్రహిస్తే మంచిది. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలవుతున్నా ఇంతవరకు మంత్రివర్గం ఏర్పాటు చేయకపోయినా టీఆర్ఎస్‌లో ఎవరూ గట్టిగా అడిగే ధైర్యం చేయలేకపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికల సంఘం వైఫల్యాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాము,” అని అన్నారు. 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరబోరని మల్లు భట్టివిక్రమార్క గట్టిగానే చెప్పుకోవచ్చు కానీ ఆయన మాటలను బట్టి వారిలో కొందరు తెరాసతో టచ్చులో ఉన్నారనే విషయం అర్ధమవుతోంది. ఎమ్మెల్యేలు పార్టీ మారనంతవరకు ఈవిధంగా చెప్పుకోవడం, మారిన తరువాత ఎంతమంది పార్టీని వీడిన కాంగ్రెస్ పార్టీ బలహీనపడదని చెప్పుకోవడం అందరూ చూస్తున్నదే. కనుక ఎంతమంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారో మంత్రివర్గం ఏర్పాటయ్యే సమయానికి స్పష్టం అవుతుంది. కనుక మంత్రివర్గం ఏర్పాటయ్యేవరకు కాంగ్రెస్‌ పార్టీ కూడా ఎదురుచూడక తప్పదు. 


Related Post