డిల్లీలో చంద్రబాబు దీక్ష...దేనికో?

January 31, 2019


img

ఏపీ సిఎం చంద్రబాబునాయుడు డిల్లీలో దీక్ష చేయబోతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన  విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 11వ తేదీన డిల్లీలో ‘ధర్మపోరాటం’ పేరుతో దీక్ష చేయబోతున్నట్లు నిన్న ప్రకటించారు. ఆ దీక్షలో ప్రజా, ఉద్యోగసంఘాలు, ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్న వ్యక్తులు సమితులు, ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు పాల్గొంటారని చంద్రబాబునాయుడు ప్రకటించారు. డిల్లీలో ఎక్కడ దీక్ష చేయబోతున్నామో త్వరలోనే ప్రకటిస్తానని చంద్రబాబునాయుడు తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను బిజెపితో...నరేంద్రమోడీతో చేతులు కలిపానని, ప్రత్యేకహోదా కంటే మెరుగైన ప్యాకేజీ ఇస్తున్నప్పుడు కాదనడం దేనికని అడిగిన చంద్రబాబునాయుడు ఆ తరువాత ఆ ప్యాకేజీ ఇచ్చినందుకు కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు కూడా. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇప్పించడంలో సహకరించినందుకు అప్పటి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడిని ఘనంగా సన్మానించారు కూడా. నాలుగేళ్ళపాటు బిజెపితో, మోడీతో అంటకాగిన తరువాత హటాత్తుగా తెగతెంపులు చేసుకొని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రధాని నరేంద్రమోడీ మోసం చేశారని, విభజన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయడంలేదని, ఏ‌పీకి ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వడం లేదంటూ చంద్రబాబునాయుడు నిలదీయడం మొదలుపెట్టారు. ఇప్పుడు డిల్లీలో దీక్షకు సిద్దం అవుతున్నారు. 

గత నాలుగున్నరేళ్ళలో పాలనలో ఎటువంటి అభివృద్ధి జరుగకపోవడంతో అసంతృప్తిగా ఉన్న రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి తనపై ఉన్న వారి ఆగ్రహాన్ని కేంద్రప్రభుత్వంపైకి మళ్ళించి తాను తప్పించుకోవడం కోసమే చంద్రబాబునాయుడు ఈ కొత్త నాటకం ఆడుతున్నారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఏ‌పీకి ప్రత్యేకహోదా సాధించుకోవాలనే తపన, చిత్తశుద్ధి చంద్రబాబుకు లేకపోవడం వలననే హోదా లభించలేదని జగన్మోహన్ రెడ్డి వాదిస్తున్నారు. హోదా, విభజన హామీల అమలు పేరుతో ఇప్పుడు రాష్ట్ర ప్రజలలో సెంటిమెంటు రగిల్చి రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు గెలవాలని చంద్రబాబు కలలు కంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబునాయుడు డిల్లీలో దీక్షకు సిద్దం అవుతున్నారని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.


Related Post