నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

January 31, 2019


img

 నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు మోదవుతున్నాయి. మొదటిరోజున రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు. ఆర్ధికశాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ఉదయం తాత్కాలిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడతారు. 

సాధారణంగా లోక్‌సభ ఎన్నికలకు ముందు ఏ ప్రభుత్వమూ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టదు. కానీ ఆ ఆనవాయితీకి విరుద్దంగా మోడీ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోందని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలు నిజం కావని, పీయూష్ గోయల్ రేపు తాత్కాలిక బడ్జెట్‌నే ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్ర ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు తెలియజేశారు. లోక్‌సభ ఎన్నికల తరువాత ఏర్పడే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందని తెలిపారు. 

రేపు ప్రవేశపెట్టబోయే తాత్కాలిక బడ్జెట్‌లో ఈ ఆర్ధికసంవత్సరంలోని 12 నెలలకు కేటాయింపులు జరిపినప్పటికీ రాబోయే 4 నెలలకు ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన ఖర్చులకు మాత్రమే నిధులు తీసుకొనేందుకు వీలుగా ఓట్-ఆన్‌-అకౌంట్ ద్వారా పార్లమెంటు అనుమతి పొందుతుంది. 

మోడీ ప్రభుత్వం రేపు తాత్కాలిక బడ్జెట్‌నే ప్రవేశపెడుతున్నప్పటికీ, దానిలో వ్యవసాయం, రైతులు, మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకొనేవిధంగా కొన్ని ప్రతిపాదనలను చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటి వలన లోక్‌సభ ఎన్నికలలో ప్రధాని నరేంద్రమోడీకి, బిజెపికి ప్రజాధారణ పెరిగి, ఎన్నికలలో బిజెపి రాజకీయలబ్ది పొందే అవకాశం ఉంటుంది కనుక కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాలు ఆ ప్రతిపాదనలను గట్టిగా అడ్డుకునేందుకు ప్రయత్నించవచ్చు. కనుక ఓట్-ఆన్‌-అకౌంట్ ద్వారా తాత్కాలిక బడ్జెట్‌కు పార్లమెంటు ఆమోదం లభించకపోతే మోడీ ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.


Related Post