రాహుల్-మోడీలపై ఎంపీ కవిత కామెంట్స్

January 30, 2019


img

నిజామాబాద్‌ తెరాస ఎంపీ కవిత ట్విట్టర్‌ వేదికగా ‘ఆస్క్ ఎంపీ కవిత’ అనే ముఖాముఖీ కార్యక్రమంలో ఇవాళ్ళ పలువురు నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానంగా “ప్రధాని నరేంద్రమోడీ గ్రాఫ్ నానాటికీ వేగంగా పడిపోతోంది. అలాగే రాహుల్ గాంధీ గ్రాఫ్‌లో కూడా పెద్దగా మార్పు లేదు. కనుక త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికల తరువాత దేశరాజకీయాలలో కేసీఆర్‌ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ కీలకపాత్ర పోషించబోతోంది. దేశంలో ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో ప్రాతీయపార్టీలదే హవా నడుస్తోంది. కనుక భాస్వారూప్యత కలిగిన పార్టీలన్నిటినీ కలుపుకొని ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటవుతుంది. దీనికోసం ఏపీలో వైయెస్సార్ పార్టీతో పాటు ఇతర పార్టీలను కూడా కలుస్తాము. మోడీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు,” అని అన్నారు. 

మన రాజకీయ పార్టీలకు ముఖ్యంగా అధికార పార్టీలకు ఏదైనా ఒక ఆలోచన వస్తే అది చాలా అద్భుతమైనదని ఆ పార్టీ నేతలు వర్ణించడం మొదలుపెడతారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి తెరాస నేతలు చెపుతున్న మాటలు వింటున్నప్పుడు తెరాస కూడా అందుకు అతీతం కాదని అర్ధం అవుతుంది. సిఎం కేసీఆర్‌ బుర్రలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆలోచనరాగానే దేశరాజకీయాలను, పార్టీల బలాబలాలను తెరాస నేతలు కొత్తగా నిర్వచించడం మొదలుపెట్టారు. ప్రధాని నరేంద్రమోడీ గ్రాఫ్ పడిపోతోంది...రాహుల్ గాంధీ గ్రాఫ్ మెరుగుపడలేదని తెరాస ఎంపీ కవిత చెప్పడాన్ని అదేవిధంగా చూడవచ్చు. ఒకవేళ కేసీఆర్‌కు ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆలోచన రానట్లయితే తెరాస నేతలు ఈవిధంగా రాహుల్, మోడీల బలాబలాల గురించి మాట్లాడేవారు కాదు కదా?   

కనుక సిఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసినంత మాత్రాన్న నరేంద్రమోడీ, రాహుల్ గాంధీలకు, కాంగ్రెస్, బిజెపిలకు ఉండే ప్రజాధారణ ఏమాత్రం తగ్గిపోదు. ఎవరి ఓట్లు వారికి పడకమానవు. నిజానికి ప్రధాని నరేంద్రమోడీని మళ్ళీ గద్దె నెక్కించడానికే సిఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నప్పుడు మోడీ గ్రాఫ్ పడిపోతుందని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మోడీ, రాహుల్ గ్రాఫులు ఏవిధంగా ఉన్నాయో దేశప్రజలందరికీ తెలుసు. మున్ముందు ఏవిధంగా ఉండబోతాయో ప్రజలే నిర్ణయిస్తారు. కనుక వారికంటే ముందుగా కేసీఆర్‌ తన ఫెడరల్‌ ఫ్రంట్‌ విశ్వసనీయతను నిరూపించుకోవలసి ఉంటుంది. 

చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించకపోవడాన్ని తప్పు పడుతున్న తెరాస ముందుగా రాష్ట్రంలో దానిని అమలుచేసి దేశానికి ఆదర్శంగా నిలవొచ్చు కదా? కానీ గత ప్రభుత్వంలో ఒక్క మహిళకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. తెరాసకు మహిళల పట్ల అంతగౌరవాభిమానాలు ఉన్నట్లయితే మంత్రివర్గంలో మహిళలకు ఎందుకు తీసుకోలేదు? అనే ప్రశ్నకు నేటికీ సమాధానం లభించదు.


Related Post