అసెంబ్లీకి రాని వారికి అధికారం ఎందుకో?

January 30, 2019


img

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. గత ఏడాది అసెంబ్లీ సమావేశాలప్పుడు కుంటి సాకుతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేల చేత సమావేశాలకు డుమ్మా కొట్టించి పాదయాత్ర చేసుకున్నారు. ఇప్పుడు పాదయాత్ర ముగిసింది కనుక ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారనుకుంటే ఈసారి కూడా కుంటి సాకుతో డుమ్మా కొట్టారు. 

ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “టిడిపిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయమని గత ఏడాదే స్పీకర్‌ను కోరాము. కానీ ఆయన మా అభ్యర్ధనను పట్టించుకోనందుకు నిరసనగా మేము అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించాము. నేటికీ ఆయన వైఖరిలో ఎటువంటి మార్పు కనబడలేదు కనుక రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన ఆయన అధ్యక్షతన జరుగుతున్న సమావేశాలు ఆశించిన ఫలితాలు లభించవనే భావనతో ఈసారి కూడా సమావేశాలను బహిష్కరిస్తున్నాము. 

రాష్ట్రాభివృద్ధికి అధికార తెలుగుదేశం ప్రభుత్వమే అతిపెద్ద అవరోధం. చంద్రబాబునాయుడు స్వప్రయోజనాల కోసమే ప్రత్యేకహోదాకు బదులు ప్యాకేజీ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏ‌పీకి ప్రత్యేకహోదా కావాలని హడావుడి చేస్తున్నారు. చంద్రబాబునాయుడు తన తప్పులను, వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు ప్రత్యేకహోదాపై చర్చించడానికనే పేరుతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అది చాలా హాస్యాస్పదంగా ఉంది,” అని అన్నారు. 

ఏ‌పీకి ప్రత్యేకహోదా సాధించే విషయంలో చంద్రబాబునాయుడు చాలా పిల్లిమొగ్గలు వేసిన మాట వాస్తవం. హోదా సాధించాలనే పట్టుదల లేకపోవడం, తన పార్టీ రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన హోదాకు బదులు ప్యాకేజీకి అంగీకరించి ఉండవచ్చు. ఈ విషయంలో ఏపీ ప్రజలు సైతం ఆయనపై గుర్రుగా ఉన్నారు. 

ఏ‌పీకి ప్రత్యేకహోదా సాధించడంలో చంద్రబాబు వైఫల్యం అయితే, తమను ఎన్నుకున్న ప్రజల తీర్పును మన్నించి అసెంబ్లీ సమావేశాలకు హాజరవకుండా జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తప్పు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలలో తమ తమ నియోజకవర్గాలలోని ప్రజాసమస్యల గురించి మాట్లాడి వాటి పరిష్కారం కోసం గట్టిగా కృషి చేయవలసిన ప్రధాన ప్రతిపక్షపార్టీ ఈవిధంగా ఏదో ఒక వంకతో ప్రతీసారి అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడుతూ మళ్ళీ తమనే గెలిపించాలని ప్రజలను కోరుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు అసెంబ్లీకే వెళ్లనివారిని ప్రజలు మళ్ళీ ఎందుకు గెలిపించాలి? ప్రత్యేకహోదా అంశంపై రాజకీయాలు చేస్తూ...అధికారంలోకి రావలనే యావతో పాదయాత్రలు చేస్తూ ప్రజాసమస్యలను పట్టించుకొని పార్టీని ప్రజలు ఎందుకు గెలిపించాలి? అనే సామాన్యుల ప్రశ్నలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసి ఉంది.


Related Post