ప్రియాంక ట్రంప్ కార్డ్ అయితే మరి రాహుల్?

January 29, 2019


img

రాహుల్ గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన వివిద రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించడంతో పార్టీలో ఇప్పుడు ఎవరూ ఆయన నాయకత్వ లక్షణాలను ప్రశ్నించడం లేదు. బిజెపి పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లలో చాలాకాలం తరువాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి తీసుకురావడంతో మంచి ఉత్సాహంగా ఉన్న రాహుల్ గాంధీ తన తదుపరి లక్ష్యం లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించారు. 

దేశ ప్రజలలో బిజెపి, ప్రధాని నరేంద్రమోడీ పట్ల కొంచెం వ్యతిరేకత నెలకొని ఉండటం, కాంగ్రెస్‌ పార్టీకి కొత్త మిత్రులు లభించడంవంటివి రాహుల్ గాంధీకి మరింత ఉత్సాహం కలిగిస్తున్నాయి. అయితే 80 ఎంపీ సీట్లున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలైన ఎస్పీ, బిఎస్పీలు రెండూ చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేయడంతో తప్పనిసరిగా అక్కడ ఒంటరిపోరాటానికి సిద్దం కావలసివచ్చింది. దాంతో రాహుల్ గాంధీ ఎవరూ ఊహించని విధంగా తన సోదరి ప్రియాంకా వాద్రాను ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా నియమించి లోక్‌సభ ఎన్నికలలో తూర్పు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పార్టీ భాద్యతలను అప్పగించారు. 

ప్రియాంకా వాద్రా హటాత్తుగా ప్రత్యక్ష రాజకీయాలలో దించడంతో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు మొదలు గ్రామస్థాయి కార్యకర్తల వరకు అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. పార్టీలో అత్యంత సీనియర్ నాయకులలో ఒకరైన గులాం నబీ ఆజాద్, “ఆమె మా ట్రంప్ కార్డ్,” అని అన్నారు. లోక్‌సభ ఎన్నికలలో ఆమె మోడీకి చెక్ పెడతారని నమ్మకం వ్యక్తం చేశారు. 

ప్రియాంకా వాద్రా చేత రాజకీయ ప్రవేశం చేయించడం మంచి నిర్ణయమే కానీ ఆమెపై కాంగ్రెస్‌ నేతలు అంతగా నమ్మకం పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఎన్నికల వ్యూహనిపుణుడు ప్రశాంత్ కిషోర్ అన్నారు. అది వాస్తవం కూడా. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను, ప్రధానికావాలనుకొనే వివిద ప్రాంతీయ పార్టీల అధినేతల ఆశలను, అందుకోసం వారు చేస్తున్న పార్టీల రాజకీయ సమీణాలను చూసినట్లయితే, హటాత్తుగా ప్రత్యక్షరాజకీయాలలోకి వచ్చిన ప్రియాంకా వాద్రా ఒంటి చేత్తో బిజెపిని వారీనందరినీ ఓడించేసి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి తీసుకురాగలరనుకోవడం అత్యాసే అవుతుంది. అయితే ప్రియాంకా వాద్రా మా ట్రంప్ కార్డ్ అని కాంగ్రెస్‌ నేతలు పదేపదే అభివర్ణిస్తుండటంతో, “ఆమె కాంగ్రెస్‌ పార్టీకి ట్రంప్ కార్డ్ అయితే మరి రాహుల్ గాంధీ ఏమిటి? జోకరా?” అని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సరోజ్‌ పాండే ప్రశ్నించారు. 


Related Post