రాహుల్ కొత్త హామీ కాంగ్రెస్‌ను గెలిపిస్తుందా?

January 28, 2019


img

ఈరోజు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక కొత్త హామీని ప్రకటించారు. ఛత్తీస్ ఘడ్ రాజధాని రాయ్ పూర్ లో జరిగిన బహిరంగసభలో రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “దేశంలో లక్షలాదిమంది సోదర, సోదరీమణులు దారిద్య్రంతో బాధలు పడుతుంటే మనం నవభారతాన్ని నిర్మించలేము. కనుక 2019 లోక్‌సభ ఎన్నికలలో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికిగాను ప్రతీపేదవాడికీ కనీస ఆదాయహామీని కల్పిస్తుంది. పేదరికాన్ని నిర్మూలించాలనే మా తపనకు, మా దార్శనికతకు ఇది నిదర్శనం,” అని అన్నారు. 

స్వర్గీయ ఇందిరాగాంధీ హయాంలో ‘గరీబీ హటావో’ (పేదరికాన్ని నిర్మిలించాలి) అనే నినాదంతో అధికారం సంపాదించుకున్నారు. ఆమె తరువాత స్వర్గీయ రాజీవ్ గాంధీ, స్వర్గీయ పీవీ నరసింహరావు, డాక్టర్ మన్మోహన్ సింగ్ వంటి హేమామీలు సుమారు రెండు దశాబ్ధాలపాటు దేశాన్ని పాలించారు. కానీ నేటికీ దేశంలో పేదరికం పోలేదు పైగా రెట్టింపు అయ్యింది. అంటే పేదరిక నిర్మూలనలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలం అయ్యిందన్నమాట! ఇప్పుడు ఇందిరాగాంధీ మనుమడు రాహుల్ గాంధీ తాను అధికారంలోకి వస్తే దేశంలో పేదరికాన్ని నిర్మూలిస్తానని హామీ ఇస్తున్నారు. దానికి ‘కనీస ఆదాయహామీ’ అనే పేరు తగిలించారు. 

రాహుల్ గాంధీ చిరకాలంగా అమేధీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. తన నియోజకవర్గంలో పర్యటించినప్పుడు అక్కడి పేదవారి గుడిసెలలోకి వెళ్ళి వారితో కలిసి భోజనం చేస్తుంటారు. మీడియా దానిని ఓ గొప్ప విషయంగా అభివర్ణిస్తుంటుంది. అయితే ఎన్ని ఏళ్లు గడిచినా ఆ నిరుపేదల జీవితాలలో రాహుల్ గాంధీ వెలుగులు నింపలేకపోయారు కనుకనే వారు అటువంటి దయనీయ స్థితిలో ఉండిపోయారనే విషయం ఎవరూ చెప్పుకోరు. రాహుల్ గాంధీకి పేదలను ఉద్దరించాలనే తపన, చిత్తశుద్ధి ఉన్నట్లయితే తమ పార్టీ పదేళ్ళపాటు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే కనీసం అమేధీ నియోజకవర్గంలో పేదప్రజల జీవితాలలో వెలుగులు నింపి ఉండవచ్చు. పదేళ్ళలో చేయని పనిని ఇప్పుడు మాత్రం చేస్తారని ఎలా నమ్మగలము?    

ఎన్నికలప్పుడు ఇటువంటి సరికొత్త హామీలతో ప్రజలను ఆకర్షించి అధికారంలోకి రావచ్చునేమో కానీ చిత్తశుద్ధి, తపన లేనివారు ఎన్ని దశబ్ధాలు పాలించినా దేశంలో పేదరికాన్ని నిర్మూలించలేరని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీయే పెద్ద నిదర్శనంగా నిలుస్తోంది. ఈ హామీని కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాస్త్రంగా భావిస్తుండవచ్చు కానీ దేశప్రజలు ఇటువంటి ఊహాజనితమైన, ఆచరణ సాధ్యంకాని హామీలను నమ్ముతారనుకోవడం అత్యాశ, అవివేకమే అవుతుంది.


Related Post