నిర్లక్ష్యమా...సాంకేతికలోపమా?

January 28, 2019


img

యుద్ధరంగంలో పోరాడుతున్నప్పుడు శత్రువుల దాడిలో యుద్ధవిమానాలు కూలిపోవడం సహజమే కానీ శిక్షణాసమయంలోనే తరచూ మన యుద్ధవిమానాలు కూలిపోతుండటం విస్మయం కలిగిస్తుంది. ఈరోజు ఉదయం  భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ యుద్ధ విమానం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నోకు 320 కిమీ దూరంలో గల కుషీనగర్ అనే ప్రాంతంలో కూలిపోయింది. పైలట్ మాత్రం సురక్షితంగా బయటపడగలిగాడు. విమానం కూలిన వెంటనే మంటలు చెలరేగి క్షణాలలో విమానం కాలి బూడిదయింది. రోజువారీ శిక్షణా కార్యక్రమాలలో భాగంగానే గోరఖ్‌పూర్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన జాగ్వార్ యుద్దవిమానం కొద్దిసేపటికే కూలిపోయినట్లు తాజా సమాచారం. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియవలసి ఉంది. ఈ ప్రమాదంపై విచారణకు అధికారులు ఆదేశించారు.

వేలకోట్లు ఖర్చుచేసి విదేశాల నుంచి కొనుగోలు చేస్తున్న యుద్ధవిమానాలు ఈవిధంగా శిక్షణా సమయంలోనే తరచూ కూలిపోతుండటంతో వాటి యుద్ధసన్నద్ధతపై అనుమానాలు రేకెత్తిస్తోంది. యుద్ధవిమానం కూలిపోయిన ప్రతీసారి ప్రమాదంపై విచారణకు ఆదేశించడంతో సాధారణ ప్రజానీకానికి ఆ కధ ముగిసిపోయినట్లే. ఆ తరువాత లోపల ఏమి జరుగుతుందో...తరచూ జరుగుతున్న ఈ ప్రమాదాలకు కారణాలు ఏమిటో...అవి పునరావృతం కాకుండా అధికారులు ఏమి చర్యలు తీసుకున్నారో ఎవరికీ తెలియదు.

ప్రమాదాలకు సాంకేతిక సమస్యలే కారణమా లేక పైలట్లు నిర్లక్ష్యం లేదా అవగాహనారాహిత్యం వలన జరుగుతున్నాయా? అనే విషయం కూడా ఎవరికీ తెలియదు. కనుక మీడియాలో ‘కుప్పకూలిన యుద్దవిమానం...పైలట్ దుర్మరణం..’అనే హెడింగుతో వార్తలు సర్వసాధారణమైపోయాయి. కారణాలు ఏవైనప్పటికీ తరచూ ఇటువంటి ఘోరప్రమాదాలు జరుగుతుండటం గమనిస్తే ఈ సమస్య పరిష్కరింపబడలేదనే స్పష్టం అవుతోంది. కనుక వేలకోట్లు ఖరీదు చేసే యుద్ధవిమానాలు వాటితో బాటు నిండుప్రాణాలు బుగ్గిపాలవుతూనే ఉన్నాయి.


Related Post