పద్మవ్యూహంలో చంద్రబాబు!

January 28, 2019


img

నరేంద్రమోడీ, బిజెపిలతో తెగతెంపులు చేసుకున్నప్పటి నుంచి ఏపీ సిఎం చంద్రబాబునాయుడుకు రోజుకో కొత్త శత్రువు పుట్టుకొస్తున్నాడు. ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడుతున్న జగన్మోహన్ రెడ్డి వైసీపీ స్థాపించినప్పటి నుంచి చంద్రబాబుపై కత్తులు దూస్తూనే ఉన్నారు. కేంద్రప్రభుత్వం కూడా బాబుతో ఆటాడుకొంటోంది. చంద్రబాబు శత్రువుల జాబితాలో కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఉండనే ఉన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఒకసారి బిజెపి...మరోసారి టిడిపివైపు ఊగిసలాడుతూ ఎప్పుడు ఎటువైపు ఉంటారో తెలియనీయకుండా చంద్రబాబును ఒకటే టెన్షన్ పెడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత చంద్రబాబుపై సిఎం కేసీఆర్‌ కూడా యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ యుద్ధసన్నాహలలో భాగంగా కేటీఆర్‌-జగన్ భేటీ, తలసాని భీమవరం పర్యటనలు జరిగాయి. 

తాజాగా బిజెపి మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వేంకటేశ్వరరావు కూడా చంద్రబాబు శత్రుసైన్యంలో చేరిపోయారు. చంద్రబాబును గద్దె దించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్న జగన్మోహన్ రెడ్డిని కలిసి మద్దతు పలికారు. పనిలో పనిగా చంద్రబాబునాయుడు అవినీతికి పాల్పడుతున్నారంటూ దగ్గుబాటి ఆరోపించారు. తాను వైసీపీలో చేరకపోయినా తన కొడుకు దగ్గుబాటి హితేశ్‌ తప్పక చేరుతాడని ప్రకటించేశారు. తల్లి ఒక పార్టీలో, కొడుకు మరోపార్టీలో ఉండటం వలన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కనుక అవసరమైతే తన భార్య పురందేశ్వరి రాజకీయాల నుంచి తప్పుకొంటారని కూడా ప్రకటించేశారు. అంటే దగ్గుబాటి కుటుంబం జగన్మోహన్ రెడ్డికి పూర్తి మద్దతు ప్రకటించినట్లు భావించవచ్చు. 

ఇక ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఆదివారం పాలకొల్లులో దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు, ముద్రగడ పద్మనాభంతో ఏకాంతంగా సమావేశమయ్యారు. అంటే చంద్రబాబు శత్రువుల జాబితాలో మరొకరు చేరినట్లే అనుకోవచ్చు. 

ఈ రాజకీయ పరిణామాలకు బోనస్ గా కోడికత్తి (జగన్ పై హత్యాయత్నం) కేసు, ఆయెషా మీరా హత్య కేసులపై ఎన్.ఐ.ఏ, సిబిఐలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. మరోపక్క టిడిపి నేతల ఇళ్లపై ఐ‌టి రెయిడ్స్ ఎప్పుడు జరుగుతాయో తెలియదన్నట్లుంది.    

ఈవిధంగా చంద్రబాబును ఒకేసారి అనేకమంది శత్రువులు అన్నివైపుల నుంచి చుట్టుముట్టడంతో ఆయన పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు కనిపిస్తున్నారు. కనుక త్వరలో జరుగబోయే సార్వత్రిక కురుక్షేత్ర మహాసంగ్రామంలో చంద్రబాబునాయుడు ఈ పద్మవ్యూహాన్ని ఛేదించుకొని అర్జునుడిలా విజయం సాధిస్తారా లేక అభిమాన్యుడిలా ఓటమిపాలవుతారో చూడాలి.


Related Post