తృణమూల్ కాంగ్రెస్ సంచలన నిర్ణయం

January 28, 2019


img

పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రానున్న లోక్‌సభ ఎన్నికలలో ఒడిశాతో సహా మొత్తం 14 రాష్ట్రాలలో పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత డెరెక్ ఒబ్రెయిన్ నిన్న భువనేశ్వర్ లో ప్రకటించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో గల 42 స్థానాలలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని, మిగిలిన రాష్ట్రాలలో అవసరమైతే పొత్తులు ఇతర పార్టీలతో పెట్టుకొంటుందని తెలిపారు. తమ పార్టీ ఏ ఏ రాష్ట్రాలలో పోటీ చేస్తుందో త్వరలోనే తెలియజేస్తామని డెరెక్ ఒబ్రెయిన్ మీడియాకు తెలియజేశారు. 

మమతా బెనర్జీ నేతృత్వంలో జనవరి 19న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోల్‌కతాలో నిర్వహించిన ‘యునైటెడ్ ఇండియా బ్రిగేడ్’ ర్యాలీకి లక్షాలది ప్రజలు, దేశంలో వివిద రాష్ట్రాల నుంచి 23 పార్టీల నేతలు తరలిరావడంతో విజయవంతం అయ్యింది. దాంతో మమతా బెనర్జీకి తనశక్తిసామర్ధ్యాలపై నమ్మకం పెరిగినట్లుంది. కానీ ప్రధానమంత్రి కావాలనే తన కల నెరవేర్చుకోవాలంటే బెంగాల్లోని 42స్థానాలతోనే సాధ్యం కాదు కనుక మరిన్ని ఎంపీ సీట్లను సంపాదించుకోవలసి ఉంటుంది. 

ఒడిశాతో సహా వివిద రాష్ట్రాలలో లక్షలాదిమంది బెంగాలీలు స్థిరపడి ఉన్నందున వారు అధికంగా ఉండే నియోజకవర్గాలలో పోటీ చేయడం ద్వారా సీట్ల సంఖ్య పెంచుకోవచ్చునని మమతా బెనర్జీ ఆలోచన కావచ్చు. ఆమె ప్రధాని అవుతారా లేదా అనే విషయం పక్కనబెడితే తృణమూల్ కాంగ్రెస్ బలం పెంచుకోవడానికి ఈ నిర్ణయం చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇతర రాష్ట్రాలలో మిత్రపక్షాలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో పొత్తులకు సిద్దపడితే వారిమద్య బంధం కూడా గట్టిపడుతుంది కనుక మమతా బెనర్జీ కల నెరవేర్చుకోవడానికి అవకాశాలు మరింత పెరుగుతాయి. 

ఒకవేళ ఇతర రాష్ట్రాలలో తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయినా కొత్తగా వచ్చే నష్టమేమీ ఉండబోదు కానీ ఒక్క సీటు గెలిచినా అది లాభమే అవుతుంది. కనుక ఇతర రాష్ట్రాలలో పోటీ చేయడం మంచి ఆలోచనే అని చెప్పవచ్చు. 


Related Post